కొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ట్యాబ్లెట్ల అమ్మకాల్లో ఇన్నాళ్లు తొలి స్థానంలో దూసుకుపోయిన కంపెనీకి భారత్‌కు చెందిన ఐబాల్ గట్టిషాకిచ్చింది. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఐబాల్ 15.6 శాతం మార్కెట్ వాటాతో తొలి స్థానం దక్కించుకుందని అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఐడీసీ తెలిపింది.

గతేడాది మూడో త్రైమాసికంలో 22.2 శాతంతో ఉన్న సామ్‌సంగ్ ఆ తర్వాతి త్రైమాసికానికి 12.9 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. 2013 నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా ఉన్న ఐబాల్ మార్కెట్ వాటా ఏడాది కాలంలోనే మూడు రెట్లు పెరగడం విశేషం. గడిచిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 9.6 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.

దేశీయంగా చౌకైన ట్యాబ్లెట్లపై ఐబాల్ దృష్టి సారించడం వల్లనే మొదటి స్థానం చేజిక్కించుకోవడానికి కారణమైందని ఐడీసీ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో గట్టిపోటీనిస్తున్న మైక్రోమ్యాక్స్ ట్యాబ్లెట్ల అమ్మకాల్లో అదే తీరును కనబర్చుతున్నది. 10.9 శాతం వాటాతో మూడో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా డేటావిండ్, లెనోవో, హెచ్‌పీలు ఉన్నాయి. మూడో త్రైమాసికంతో పోలిస్తే నాలుగో క్వార్టర్‌లో ట్యాబ్లెట్ల అమ్మకాలు 3.6 శాతం చొప్పున పెరిగాయి.

దీనిపై సామ్‌సంగ్ ప్రతినిధి స్పందిస్తూ..అలాంటిదేమి లేదని, ట్యాబ్లెట్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. గడిచిన సంవత్సరంలో భారత్‌లో అమ్మకాలు అంతక్రితం ఏడాదితో పోలిస్తే 15 శాతం తగ్గి 35 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: