కొన్ని రాష్ట్రాల్లో క‌రోనా చికిత్స పేరుతో వెర్రి వెయ్యి త‌ల‌లు వేస్తోంది. ఆయుర్వేదం, ప్రాచీన వైద్యం, ఇంగ్లీష్ మెడిస‌న్ రూపంలో అనేక విధాలుగా ఎలాంటి శాస్త్రీయ విధానం, నిరూప‌ణ లేని గుడ్డి న‌మ్మ‌కాల‌తో త‌మ ప్రాణాల‌కు ముప్పు తెచ్చుకోవ‌డ‌మే కాదు.. ప్ర‌చారాన్ని చేప‌డుతూ ఇత‌రుల ప్రాణాల‌కు ముప్పు తెస్తున్నారు కొంత‌మంది. త‌మ న‌మ్మ‌కాల‌ను, అభిప్రాయాల‌ను స‌మాజంపై రుద్దుతూ ప్రాణాలు గాలిలో క‌లిసేలా చేస్తున్నారు. వాస్త‌వానికి కరోనా రాకుండా వ్యాక్సిన్ వచ్చింది కానీ.. వచ్చేసిన కరోనాను తగ్గించే మందులు ఇంకా రాలేదు. ఇలాంటి సమయంలో సంప్రదాయ ప్రత్యామ్నాయాలవైపు అంతా మొగ్గుచూపుతున్నారు. అయితే కొన్ని ప్రచారాలు నమ్మవద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది.


కోవిడ్‌కు ఆవు పేడ చికిత్స.. గోశాలలకు జనాలు పరుగులు పెడుతున్నారు... శరీరంపై గో మూత్రం, పేడ పూసుకుంటే కోవిడ్ రాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  క‌రోనాను న‌యం చేసేందుకు వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తిస్థాయిలో వైద్యం అందుబాటులో లేద‌నే చెప్పాలి. ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ఇప్పటి వరకు ఔషధాలు రాలేదు. వ్యాక్సిన్లు వచ్చినా.. ఇంకా అందరికీ అందుబాటులో ఉండడంలేదు. ఈక్ర‌మంలోనే కొంత‌మంది సొంత తెలివితేట‌లను స‌మాజంపై రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

 

క‌రోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకంతో... ఇక్కడి శ్రీస్వామి నారాయణ్‌ గురుకుల్‌ విశ్వవిద్యా ప్రతిష్ఠానంలో కొందరు ఆవుపేడ చికిత్స పొందుతున్నారు. ప్రతి  ఆదివారం వంద‌లాది మంది ఇక్కడకు వచ్చి పేడ, మూత్రాన్ని ఒంటికి పూసుకుంటున్నారు. కొద్దిసేపు అయ్యాక ఆవు పాలతో శుభ్రం చేసుకుంటున్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఔషధ దుకాణాల్లో పనిచేసేవారు కూడా ఈ చికిత్స పొందుతున్నారు. దీనివల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ నుంచి తొందరగా కోలుకుంటారని భావిస్తున్నారు. హిందూమతంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు. శతాబ్దాలుగా గోమూత్రాన్ని ఇళ్లను శుద్ధి చేయడానికి పూజలకు వాడుతున్నారు. అలాగే చికిత్సల్లోనూ యాంటి సెప్టిక్ ఔషధంగా వినియోగిస్తున్నారు. అందుకే ఆవుపేడ కరోనాను తరిమికొడుతుందని విశ్వసిస్తున్నారు.


ఇదిలా ఉండ‌గా ఆవుపేడ, మూత్రంతో చికిత్స ఎంతవరకూ పనిచేస్తుందో, దీని ద్వారా కొవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఏ శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైందో ఎవరికీ తెలియదని , ఈ పేడ పూసుకోవ‌డం వ‌ల‌న  ఇతరత్రా ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఉంటుంద‌ని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డా.దిలీప్‌ మావ్‌లంకర్‌ పేర్కొన్నారు.  పేడ అనేది శరీరం విసర్జించిన వ్యర్థం. ఇది మరో శరీరాన్ని బలోపేతం చేసి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ ఇవ్వలేదు. పేడ చికిత్సలో శాస్త్రీయత ఏమీ లేదు. ప్రజలు ఇలాంటి చికిత్సల జోలికి వెళ్లకుండా... వైద్యులను సంప్రదించాలి  అని భారతీయ వైద్య మండలి మహిళా విభాగం ఛైర్‌పర్సన్‌ డా.మోనా దేశాయ్‌ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: