
రాష్ట్రంలోని ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో జనసేన పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే పోటీచేయక తప్పని పరిస్థితి.. అసలే ఉన్న ఒకేఒక్క ఎమ్మెల్యే రాపాక కూడా వైసీపీకి అనుకూలంగా మారడంతో జనసేన శ్రేణులు ఎలాగైనా సరే.. బద్వేల్ లో పాగా వేయాలని కోరుకుంటున్నారు. అందుకోసమే మిత్రపక్షమైన బీజేపీతో చర్చలు జరిపి.. అక్కడ జనసేన తరపున అభ్యర్థిని బరిలో దింపాలనే ప్రతిపాదన ఉంచింది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్‌ను తమ అభ్యర్థిగా టీడీపీ కూడా ప్రకటించేసింది. ఇక మిగిలింది కేవలం జనసేన అభ్యర్థి ఎవరన్నది మాత్రమే.
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల సమయంలో బీజేపీకి జనసేన మద్దతిచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా ఈసారి బద్వేల్ సీటును జనసేనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ, జనసేన నేతలు కలిసి చర్చలు జరిపారు. బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం కావడంతో జనసేన ఇక్కడ కచ్చితంగా ప్రభావం చూపాలని అనుకుంటోంది. ఇక్కడ గతంలో జనసేన మద్దతిచ్చిన బీఎస్పీ అభ్యర్థి నాగిపోగు ప్రసాద్ కి, గతఎన్నికల్లో 1321 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ తరపున పోటీ చేసిన తిరువీధి జయరాములుకి కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో మాట్లాడిన పవన్.. తమకు బద్వేల్ లో పట్టుందని.. అవకాశం వస్తే నిరూపించుకుంటామని అన్నారు. ఈసారి జనసేన నేరుగా బరిలో దిగితే లెక్కలు మారతాయంటున్నారు పవన్ కల్యాణ్.. అయితే ఎన్నికలో గెలిచేలా వ్యూహరచన చేస్తున్నారు. బలమైన అభ్యర్థికోసం వెదుకుతున్నారు. ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా.. ఈసారి జనసేన తరపునే పోటీ ఉంటుందనేది మాత్రం ఖాయం అంటున్నారు జనసైనికులు.