రాజ్యసభ సీట్ల వ్యవహారంలో పార్టీలన్నీ ఒకేరకంగా ఆలోచిస్తాయనడంలో అనుమానం లేదు. విన్ను విరిగి మీదపడినా ఆరేళ్లపాటు వారిని ఎవరూ కదిలించలేరు. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అలాంటి సీట్లకు మాత్రం ఎక్కడలేని డిమాండ్ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు పారిశ్రామిక వేత్తలంతా రాజ్యసభలు రెడీ అవుతున్నారు. వారంతా పార్టీలను, పార్టీ అధినేతల్ని సంతోషపరచడంలో ముందుంటారు. రాజకీయ సమీకరణాలన్నీ మిగతా సీట్ల విషయంలో బేరీజు వేసుకుంటారు కానీ, రాజ్యసభ సీట్లు మాత్రం తమకి నచ్చినవారికే ఇచ్చుకుంటారు అధినేతలు. అదేమంటే మాత్రం పార్టీ మనుగడకు అవన్నీ అవసరం అని చెప్పేస్తారు. ఈ కోవలోనే ఏపీలో వైసీపీ కోటాలో పరిమల్ నత్వానీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరో ఇండస్ట్రియలిస్త్ ఏపీ నుంచి వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం జోరందుకుంది. గౌతమ్ అదానీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆ ఛాన్స్ ఇస్తారంటున్నారు. ఇదే నిజమైతే.. కచ్చితంగా జగన్ విమర్శలను కొని తెచ్చుకున్నట్టే లెక్క.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించాలని అనుకుంటున్నారు సీఎం జగన్. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న బలాబలాలు లెక్కవేసుకుంటే వైసీపీకే ఆ నాలుగు సీట్లు దక్కుతాయి. ఇందులో ఒక సీటు విజయసాయిరెడ్డికి మరోసారి రిజర్వ్ అవుతోంది. మిగిలిన మూడు సీట్లు ఎవరికి ఇస్తారనే విషయంలో తీవ్ర చర్చ నడుస్తోంది.

ఆ ముగ్గురిలో ఒకరికి రాష్ట్రంతో సంబంధం లేదా..?
గతంలో పరిమల్ నత్వానీని రాజ్యసభకు పంపే సమయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ జగన్ వేటినీ లెక్కచేయలేదు. ఇప్పుడు ఉన్న మూడు సీట్లలో ఒకటి రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన బీదా మస్తాన్ రావుకి రాజ్యసభ సీటు కన్ఫామ్ అంటున్నారు. ఆయన కూడా వ్యాపార వర్గానికి చెందినవారే. అయితే సుదీర్ఘంగా ఆయన రాజకీయాల్లోనూ ఉన్నారు. ఆయన తమ్ముడు బీదా రవిచంద్ర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. బీదా మస్తాన్ రావు వైసీపీలోకి వచ్చేటప్పుడే ఆయనకు ఆ మేరకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి అనే న్యాయవాది పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక మూడో స్థానం గౌతమ్ అదానీకి కుటుంబానికి ఇస్తారని అంటున్నారు. అదానీ ఇప్పటికే చాలా సార్లు సీఎం జగన్ ని కలిసి వెళ్లారని చెబుతున్నారు. అదే నిజమైతే.. రెండు సీట్లు కేవలం రాజకీయాలకోసమే రాష్ట్రేతరులకు కట్టబెట్టినట్టు లెక్క. మరి దీనిపై వచ్చే విమర్శలను జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: