ఎన్నికలు జరిగి రిజల్ట్స్ సమయం ఆసన్నం అవుతున్నప్పటికీ ఏపీ రాజకీయం సెగలు కక్కుతోంది. విపక్షాలు ఒకరిపై ఒకరు ఒక రేంజులో విరుచుకు పడుతున్నారు. మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ ముగిసిన తర్వాత చోటు చేసుకున్న హింస ఎక్కువైపోతోంది. అవును, ఎప్పుడూ లేని విధంగా వ్యక్తిగతంగా టార్గెట్లు చేస్తూ వారి వారి ఆస్తులపై దాడికి పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఆ తరువాత ఈ హింసకి కారణం మీరంటే మీరేనని అధికార.. విపక్షాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే.. గతంలో ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నికల పుణ్యమాని హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం.

ఈ నేపథ్యంలోనే తాజాగా క్రిష్ణా జిల్లా, మచిలీపట్నంలో చోటు చేసుకున్న పరిణామం స్థానికంగా పెను సంచలనంగా మారింది. విషయం ఏమిటంటే జనసేనకు చెందిన కర్రి మహేశ్ అనే నేత కారును గుర్తు తెలియని దుండగలు తగుల బెట్టారు. ఇంటి ముందు పార్కు చేసిన కారును నిప్పు పెట్టి మరీ ఉద్దేశ పూర్వకంగా కాల్చేయడం ఏమిటని మహేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో తన కారును తగలబెట్టినట్లుగా సమాచారం. తన కారును అధికార పార్టీకి చెందిన వారే తగుల పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు.

జనసేన తరఫున ప్రచారం చేయడమే తాను చేసిన పాపమా అంటూ ఆయన తన బాధని మీడియా ముందు వ్యక్తం చేసాడు. జనసేన తరఫున ప్రచారం చేస్తే తనపై ఎందుకు పగబడుతున్నారు? ఓడిపోతామని భయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ తరఫున పని చేస్తే ఇక్కడ వైసీపీ వారు తట్టుకోలేకపోతున్నారని.. గతంలోనే తమ ఇంటిపై అర్థరాత్రి వేళలో దాడి చేసినట్లుగా ఈ సందర్భంగా గుర్తు చేసారు. తమను కొట్టిన వారిపై కేసు పెడితే.. రోజులో వారంతా తిరిగి బయటకు వచ్చి తిరుగుతున్నారని.. ఇప్పుడు తన కారును వారే తగులబెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ కారును తగలబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: