
ప్రస్తుత లైసెన్స్ దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడం ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ఇది నాన్ - రిఫండబుల్ కావడంతో, దరఖాస్తుదారులు ఆలోచించి ముందడుగు వేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాక, గత కొన్నేళ్లలో లాభాలు తగ్గిపోవడం, మద్యం వ్యాపారంపై పెరిగిన పన్నులు, పోటీ పెరగడం కూడా వ్యాపారుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. కరీంనగర్ జిల్లాలో 94 వైన్ షాపులు కేటాయించాల్సి ఉండగా, ఇప్పటివరకు పదిలోపే దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితి ఇతర జిల్లాల్లోనూ కనిపిస్తోంది. దరఖాస్తుల తక్కువ సంఖ్య కారణంగా ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అయితే ఎక్సైజ్ వర్గాల ప్రకారం, మద్యం వ్యాపారులు ఎప్పుడూ ముందుగా మార్కెట్ పరిస్థితిని అంచనా వేసి, చివరి రోజుల్లోనే దరఖాస్తులు వేస్తారని చెబుతున్నారు. ఎక్కడ పోటీ తక్కువగా ఉంటుందో, ఏ ప్రాంతంలో లాభం ఎక్కువగా ఉంటుందో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని వారు అంటున్నారు. కాబట్టి ఇప్పుడే స్పందన తక్కువగా ఉందని చెప్పడం తగదంటున్నారు. ఏదేమైనా, అక్టోబర్ 18తో దరఖాస్తు గడువు ముగియనుండగా, అక్టోబర్ 23న లాటరీ విధానంలో షాపులు కేటాయించనున్నారు. చివరి రోజుల్లో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అప్లికేషన్ ఫీజు పెంపు ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎంతవరకు తగ్గుతుందో చూడాలి.