
స్థానిక సర్వేలు, ప్రజాభిప్రాయాల ప్రకారం మాగంటి సునీతకు సానుభూతి వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు, బస్తీల్లో ఉండే పేద వర్గాలు ఆమెకు బలమైన మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మాగంటి కుటుంబం గత రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రజలకు సేవ చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందువల్ల ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పేదలకు ఇళ్ల నిర్మాణం, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం వంటి పనులు వారిని ప్రజలకు మరింత చేరువయ్యేలా చేశాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మిక్స్‌డ్ ఓటర్లు ఉంటారు. అటు ధనికులతో పాటు ఇటు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కూడా ఉంటారు.
వీరితో పాటు ఆంధ్రా సెటిలర్లు, ఐటీ ఉద్యోగులు వంటి వర్గాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నుండి ఏ మహిళా అభ్యర్థి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో మాగంటి సునీత రంగంలోకి దిగడం ఓ రికార్డే అని చెప్పాలి. ఇక బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే పార్టీ వ్యూహకర్తలు పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సమన్వయంతో మాగంటి సునీత గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మొత్తం మీద, సానుభూతి ప్రభావం, మహిళా సెంటిమెంట్, కమ్మ ఓటర్లతో పాటు సెటిలర్ల ఓట్లు, బస్తీ ఓటర్లు, మాగంటి గోపీనాథ్‌కు ఉన్న మంచి పేరు ఇవన్నీ సునీతకు ప్లస్ కానున్నాయి.