
“గోవధ జరుగితే జనసేనగా మేము పూర్తి వ్యతిరేకం” అని పవన్ బహిరంగంగా స్పష్టం చేశారు. దీంతో సీఎం చంద్రబాబు కూడా జోక్యం చేసుకొని, రాష్ట్రంలో ఎక్కడా గోవధకు అనుమతి లేదని, ఫుడ్ పార్క్‌లో కేవలం పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక ఇక్కడితో ఆగకుండా పవన్ లులూ గ్రూప్ వ్యాపార విధానంపైనే ప్రశ్నల ముప్పు వదిలారు. “భూములు ప్రభుత్వమే ఇస్తోంది, కానీ షరతులు మాత్రం ఆ కంపెనీ పెడుతోంది. ఇది ఏ విధానం?” అని పవన్ చురకలు వేశారు. విశాఖ, విజయవాడలో లులూ సంస్థకు ఇచ్చిన భూముల ప్రాతిపదిక ఏంటి? స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారా? లేదా అన్నదానిపై కూడా పవన్ ప్రశ్నలు సంధించారు.
మరింతగా, “లులూ మాల్స్‌లో తమ సొంత సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇక్కడా అదే జరిగితే ప్రభుత్వానికి లాభం ఏమిటి?” అని పవన్ ఆగ్రహంగా ప్రశ్నించారు. స్థానికులకు ఉద్యోగాలు తప్పనిసరిగా కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన పట్టుదలగా చెప్పారు. ఈ చర్చలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొని, లీజు మొత్తాన్ని 5 సంవత్సరాలకు 5% మాత్రమే పెంచడం సబబా అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలతో కూడా మంత్రివర్గం ఉత్కంఠభరితమైంది. మొత్తం మీద ఈ కేబినెట్ మీటింగ్‌లో పవన్ కల్యాణ్ తనదైన స్టైల్లో వ్యవహరించారు. నేరుగా, స్పష్టంగా ప్రశ్నలు వేసి అధికారులకే నీళ్లు నమిలించేలా చేశారు. లులూ లాంటి పెద్ద కంపెనీ అయినా సరే — “ప్రజా ప్రయోజనాలు ముందు” అనే తన స్థాయిని పవన్ మరోసారి చూపించారు.