
ఇటీవల వీరేందర్ సింగ్ ఒక ప్రమాదంలో గాయపడటంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. అందుకోసం ఆయన అమృత్‌సర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే సర్జరీకి ముందు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే అభిమానులు, సహచర నటులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. వీరేందర్ సింగ్ నటుడిగా మాత్రమే కాదు, బాడీ బిల్డింగ్ ప్రపంచంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ గెలుచుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత పలు బాడీ బిల్డింగ్ పోటీల్లో విజయం సాధించి, యువతకు ఫిట్‌నెస్ ఐకాన్‌గా నిలిచారు.
సినీ ప్రపంచంలో ఆయన చివరిగా కనిపించిన చిత్రం “టైగర్ 3”, ఇందులో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌తో కలిసి నటించారు. ఆ సినిమాలో ఆయన పాకిస్తాన్ జైలు అధికారి షకీల్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. ఆ టైంలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్‌తో ఆయన సరదా సంభాషణలు, జిమ్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకునే వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే ఫిట్‌నెస్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే వీరేందర్ వంటి వ్యక్తికి కూడా గుండెపోటు రావడం అభిమానులను తీవ్ర ఆలోచనలో పడేసింది. “ఎప్పుడూ వర్కౌట్స్ చేసే, హెల్తీ డైట్ ఫాలో అయ్యే వారికి కూడా హార్ట్ ఎటాక్ వస్తుందా?” అని చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో పలువురు యువ నటులు, ఫిట్‌నెస్ ట్రైనర్లు కూడా ఇలాంటి కారణాలతో మరణించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా నరేందర్ సింగ్‌ను స్మరించుకుంటూ పోస్ట్‌లతో నిండిపోయింది. ఫ్యాన్స్, బాడీ బిల్డింగ్ కమ్యూనిటీ, సినీ ప్రముఖులు అందరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. “అంతటి ప్రతిభావంతుడు, మనసుకు హత్తుకునే వ్యక్తి మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం” అంటూ అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు.సినీ ఇండస్ట్రీలో మరో ప్రతిభావంతుడిని కోల్పోవడం ఇండస్ట్రీకి, అభిమానులకు ఎప్పటికీ పూడ్చలేని లోటుగా మిగిలిపోయింది..!!