 
                                
                                
                                
                            
                        
                        ఒక సాధారణ టీ అమ్మే వ్యక్తి (చాయ్‌వాలా) ఇంతటి ఉన్నత స్థాయికి ఎదగడం ఈ కుటుంబాలకు జీర్ణించట్లేదని, అందుకే నన్ను తిడుతూ తమ అసహనాన్ని బయటపెడుతున్నారని మోదీ ఎద్దేవా చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ముజఫ్ఫర్‌పూర్‌లో నిర్వహించిన భారీ ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ — ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు మళ్లీ ఒకసారి నకిలీ హామీల దుకాణం తెరిచాయని, అబద్ధాలు చెప్పడమే వారి రాజకీయ సంప్రదాయం అని ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ “జమానత్” (బెయిల్)పై బయట ఉన్నారని గుర్తుచేస్తూ, అలాంటి వారిని ప్రజలు నమ్మగలరా అని మోదీ ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు అసలు ఒకదానికొకటి వ్యతిరేకమని, నీరు మరియు నూనెలాంటి స్వభావం కలిగినవని, వీరి మధ్య అసలు సఖ్యతే లేదని ఆరోపించారు. ఎక్కడ ఆర్జేడీ, కాంగ్రెస్ పాలన ఉంటే అక్కడ తప్పకుండా “జంగిల్ రాజ్” (అరాచక పాలన) వస్తుందని మోదీ తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆర్జేడీ-కాంగ్రెస్ పాలనను “5-K” సిద్ధాంతంతో పోల్చారు —
K-కట్టా (నాటుతుపాకీ) – మోసపూరిత వాగ్దానాలు, భయపెట్టే రాజకీయాలు.
K-క్రూరతా (క్రూరత్వం) – ప్రజలపై అణచివేత, ప్రతిపక్షాలపై కక్షతీరు.
K-కటుత (దురుద్దేశం) – స్వార్థపూరిత రాజకీయ లక్ష్యాలు.
K-కుశాసన (సుశాసన లేమి) – పరిపాలనలో వైఫల్యం, ప్రజాసేవకు దూరం.
K-కరప్షన్ (అవినీతి) – దేశ ధనాన్ని దోచుకునే నాయకత్వం.
ఈ ఐదు లక్షణాలే ఆర్జేడీ మరియు కాంగ్రెస్ పాలనకు ప్రతీకలు అని మోదీ స్పష్టంగా తెలిపారు.
అంతేకాకుండా, చఠ్ పూజ వంటి పవిత్రమైన పండుగపై ఈ పార్టీలు చేసిన వ్యాఖ్యలు బిహార్ ప్రజల మనసును గాయపరిచాయని ఆయన అన్నారు. ఓట్ల కోసం పవిత్రమైన పండుగను అవమానించడం ఎంత దుర్మార్గమో ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని చెప్పారు. “తమ పిల్లల కోసం నీళ్లు లేకుండా ఉపవాసం ఉండే తల్లులు ఈ రకమైన అవమానాన్ని ఎలా భరిస్తారు?” అని మోదీ ప్రశ్నించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాయని, చఠ్ పూజను వారు కేవలం ఒక నాటకం, ప్రహసనం వంటిదిగా చూస్తున్నారని మోదీ దుయ్యబట్టారు. బిహార్ ప్రజలు అలాంటి అవమానాలను ఎన్నటికీ మన్నించరని హెచ్చరించారు. “చఠ్ పూజ బిహార్ గౌరవం, సంస్కృతి, విశ్వాసం ప్రతీక. దానిని అవమానించడం అంటే బిహార్ ఆత్మను అవమానించడం” అని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇక చివరిగా, ప్రజలను ఉద్దేశిస్తూ మోదీ అన్నారు — “మళ్లీ ఒకసారి బిహార్ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలంటే అవినీతి, అబద్ధాల బంధాన్ని తెంచి నిజాయితీతో కూడిన పాలనను ఎన్నుకోండి. బిహార్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది” అని పిలుపునిచ్చారు.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి