''సీఎంను మారుస్తున్నారు..'' ఈ మాట కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వినిపిస్తోంది. ఇందులో కొత్త విషయం ఏం లేదు. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా సీఎం ఢిల్లీ వెళ్లడం.. ఆ వార్తలు సద్దుమణగడం జరిగాయి.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న వార్తల్లో కాస్త బలం ఉన్నట్లు కనిపిస్తోంది. హస్తినలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర వాతావరణాన్ని వేడెక్కించాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి మార్పు విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నెల 9న సూరజ్ కుండ్ లో జరిగే కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ నేతల అభిప్రాయం. ఈ తరుణంలో తనదైన రాజకీయాన్ని నడుపుతున్నారు నల్లారి... మార్పు ఖాయమనుకున్నప్పుడు తెలంగాణ అంశాన్ని తేల్చకుండా సీఎంను మారిస్తే ప్రయోజనం లేదన్న అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేలా తన అనుయాయులను పురమాయించారు. దీంతో అధిష్టానాన్ని ఇరుకున పెట్టాలని కిరణ్ యోచిస్తున్నారు.. తెలంగాణ అంశం ఇప్పట్లో పరిష్కారం కాదన్నది కిరణ్ ధీమా... అందుకే తెలంగాణ అంశాన్ని బూచిగా చూపి తన పదవిని పదిలంగా ఉంచుకోవాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఢిల్లీలో ఎంత హడావిడి నెలకొన్నప్పటికీ ముఖ్యమంత్రి మార్పు పై జరుగుతోన్న ప్రచారాన్ని ఎవరూ కొట్టిపారేయటం లేదు. కొద్దిరోజుల క్రితం ఆర్ధిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి రహస్యంగా ఢిల్లీకి వచ్చి కొంతమంది పెద్దలతో మంతనాలు జరిపారు. సోమవారం పార్టీ అధినేత్రి సోనియాతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ కావటం, ఆ తర్వాత టి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చొద్దని హైకమాండ్ పెద్దలను కలవటం, రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలకు అద్దం పడుతున్నాయి.. ఇటు ఎంపీలు కూడా సీఎంను మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చాలా వద్దా అన్న విషయంపై సోనియాగాంధీకి ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అన్నారు. మొత్తంగా మొన్నటివరకూ తన పదవి పై కొండంత ధీమాతో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి తాజా ఢిల్లీ పర్యటన కొంత ఝలక్ ఇచ్చినట్లు కనిపించింది. మార్పు గురించి అధిష్టానం ఆలోచిస్తోందని తెలుసుకున్న సీఎం, నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. మరి ఎడతెరిపి లేకుండా రాష్ట్ర నేతలతో మంతనాలు జరుపుతోన్న అధిష్టానపెద్దలు రాష్ట్ర రాజకీయాలను ఎటువంటి మలుపు తిప్పబోతున్నారన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: