తెలుగు సంవత్సరాది చైత్రమాసంలో జరుపుకునే తెలుగు వారి మొదటి పండగ. ఇక ఉగస్య ఆది అంటేనే ఉగాది అని అర్థం. ఉగ అనగా నక్షత్ర గమనం – జన్మ- ఆయుష్షు అని అర్థాలు వస్తాయి. ప్రపంచ జన్మ ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఉగాది అంటారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈరోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రాముక్యత ఉంది.

ఇక ఉగాది రోజున పంచాంగ శ్రావణం జరుపుతుంటారు. నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటారు. ప్రస్తుతం శార్వారి నామ సంవత్సరం నడుస్తుండగా.. ఉగాది రోజు నుంచి ప్లవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది ఈ క్రమంలో అసలు ఈ ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు… దాని చరిత్ర ఎంటో తెలుసుకుందామా.

అయితే చైత్ర శుక్ల పాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని.. ఆరోజు నుంచే ఈ సృష్టి ప్రారంభమయ్యిందని.. అందుకే ఈ చైత్ర శుక్ల పాడ్యమి పర్వదినాన్ని ఉగాదిగా జరుపుకుంటారని చెబుతుంటారు. వేదాలను హారించాడని.. సోమకుని వధించేందుకు విష్ణువు మత్య్సవతారంలో వచ్చి అతడిని వధించాడని.. ఆ తర్వాత ఆ వేదాలను తీసుకోని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడని ఆరోజు నుంచే ఉగాది జరుపుకోవడం ప్రారంభమైందని చెబుతుంటారు.

ఇక ఉగాది రోజున అతి ముఖ్యమైన వంటకం అంటే ఉగాది పచ్చడి. దీనిని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు. ఈ షడ్రుచులను మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో జరిగే అన్ని రకాల భావనలను ఈ పచ్చడిలో ఇమిడి ఉంటాయి. ఇందులో వాడే ఒక్కో పదార్థం ఒక్కో భావానికి ప్రతీకలుగా ఉంటాయి.

బెల్లం- తీపి జీవితంలో ఆనందానికి గుర్తు. వేప పువ్వును చేదుగా వాడుతారు. జీవితంలో బాధకలిగించే అనుభవాలకు గుర్తు. ఇక చింతపండు పులుపు ఇది నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు గుర్తు. ఉప్పు  జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. పచ్చి మామిడి ముక్కలు వగరు. కొత్త సవాళ్లు చూపుతుంది. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను తెలియజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: