సరైన ప్రణాళిక, పుస్తకాల ఎంపికలో జాగ్రత్త, కష్టపడేతత్వంతో పోటీ పరీక్షల్లో విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు.. ప్రణాళికతో చదవడం ద్వారా పోటీలో విజేతలుగా నిలవొచ్చు. పోటీ పరీక్షలు.. గెలిస్తే విజేత. ఓడితే పాఠం. గెలిచి నిలిస్తే ఉద్యోగం, పోరాడి ఓడితే మరోసారి రాసేందుకు అనుభవం. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే.. తెలివి తేటలు, ప్రణాళిక, కష్టపడేతత్వం, కొంతమేర అదృష్టం ఉండాలి. వీటితోపాటు విజయతీరానికి చేరుకోలేకపోతే కెరీర్‌లో ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటో చూసుకొని పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపాలి.  గ్రూప్స్, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు, పోలీసు నోటిఫికేషన్లలో సక్సెస్ పొందాలంటే.. కనీసం ఏడాది పాటు చదవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నియామక ప్రక్రియలో జాప్యం జరగొచ్చు.

గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కుటుంబం, సమాజం, సహచరుల నుంచి రకరకాల ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. వీటన్నింటితోపాటు ఆర్థిక సమస్యలు ఉండనే ఉంటాయి. కాబట్టి అన్నింటిని తట్టుకునే సహనం, మానసిక సంసిద్ధతతోపాటు అవసరమైన ఆర్థిక వనరులు ముందే ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా సానుకూల ఆలోచనలతో ముందడుగు వేయాలి. ఒకరకంగా చెప్పాలంటే.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడం అనేది అభ్యర్థిలోని సహనానికి పరీక్ష ! ఏ పరీక్షలకు సన్నద్ధమవ్వాలి.. అందుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన.. సదరు పరీక్ష సిలబస్.. గత విజేతల ప్రిపరేషన్ తీరు వంటి వాటిని ముందుగా అధ్యయనం చేయడం లాభిస్తుంది.  ఏకకాలంలోఅనేక రకాల పోటీ పరీక్షలు రాయొచ్చు.

ఆయా పరీక్షల సిలబస్‌లో సాధారణంగా కనిపించే అంశాలు.. జనరల్ స్టడీస్, అర్థమెటిక్ (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్), మెంటల్ ఎబిలిటీ(రీజనింగ్), ఇంగ్లిష్. వీటిపై పట్టుసాధిస్తే.. ఏ పరీక్షలో అయినా విజయం సొంతం చేసుకోవచ్చు.  పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో మెటీరియల్ సేకరణ సవాలుగా మారింది. విద్యార్థులు మార్కెట్లో లభించే అకాడమీ పుస్తకాలు, ప్రముఖ టీచర్ల పుస్తకాలు చదవడం మేలు. అభ్యర్థులకు సబ్జెక్టుపై సమగ్ర పరిజ్ఞానం ఉంటేనే సమాధానాలు గుర్తించే పరిస్థితి ఉంది. గతంలో ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్‌లో బిట్లు ప్రాక్టీస్ చేసి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే వీలుండేది, పోటీ విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా సబ్జెక్ట్‌ను లోతుగా పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: