సలహాలు వద్దు... పాఠాలే ముద్దు  అంటున్న మరో ఆర్థిక వేత్త ఎవరు ?

రఘురామ్ రాజన్ గుర్తున్నారా ?.. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రపంచ ఖ్యాతి పొందిన ఆర్థిక వేత్త.  అంతకు మించి మంచి అధ్యాపకుడు.   తమ విశ్వ విద్యాలయాలలోని విద్యార్థులకు పాఠాలు చెప్పాలని విదేశీ యూనివర్సిటీలు  రఘురామ్ రాజన్ వెంట క్యూ కడుతాయి.తమిళనాడు రాష్ట్రం కూడా తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సలహాదారుగా ఉండాలని కోరింది.దానికి ఆయన ఇంకా అంగీకారం తెలుప లేదు. ఆ విషయం కాస్త పక్కన పెడదాం. రఘరామ్ రాజన్ బాటలో నడిచేందుకు మరో ఆర్థిక వేత్త సిద్ధమయ్యారు.  ఈయన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తన్నారు. ఈయన పేరు కే.వి. సుబ్రమణియన్.

 ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న ఇండియన్ స్కూల్ ఆఫ్  బిజినెస్  హైదరాబాద్ లో అధ్యాపకుడిగా ఉన్న కే.వి. సుబ్రమణియన్ ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఆర్థిక శాఖ సలహాదారుగా నియమించింది. అన్ని వసతి సౌకర్యాలు, హోదా కల్పించింది. ఈయన పదవీ కాలం మూడేళ్లు. 2018 లో ఈయన కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.  ఎక్కడా, ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకో లేదు. ప్రభుత్వానికి మచ్చ తెచ్చే సలహాలు ఇవ్వలేదు. ఈయన చర్యలు, సలహాలను భారత్ లోని ప్రతిపక్షాలు చాలా సార్లు ప్రశంసించాయి కూడా. పారిశ్రామిక వర్గాలు కోవిడ్-19 కాలంలో ఇతని మాటలకు ఆలకించాయి. ఆర్థిక రంగం కుదేలవుతున్న సమయంలో వివిధ రంగాలను ఇతనిచ్చిన సలహాలు ఆ రంగ పురోగతికి ఊతంగా నిలిచాయి.  మరో రెండు నెలల్లో  ఈ ఆర్థిక వేత్త పదవీ కాలం ముగియ నుంది.  తరువాత మరలా ఇతనిని కొనసాగించేందుకు ప్రభుత్వం ఉంది. ఆ దిశగా  సంకేతాలు ఇచ్చింది. కానీ సుబ్రమణియన్ మాత్రం ఆర్థిక సలహాదారు పదవిలో కొనసాగేందుకు అంగీకరించ లేదు. విద్యార్థులకు పాఠాలు చెప్పడం లోనే ఆనందం ఉందని స్పష్టంగా ప్రకటించారు. తనకు అవకాశం కల్పించిన  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మమంత్రి నిర్మలా సీతారామన్ కు సుబ్రమణియన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఎప్పుడు కూడా  పత్రికలకు, ప్రసార మాధ్యమాలకు దూరంగా ఉండే సుబ్రమణియన్ తాజా నిర్ణయంతో ఒక్క సారిగా వార్తల్లోకి ఎక్కారు. జాతీయ మీడియా ఇతని నిర్ణయం పై  పలురకాలుగా స్పందించింది. స్వంత పనులపై వెళుతున్న కారణంగా ఈ ఆర్థిక వేత్త పదవిని తిరిగి స్వీకరించడం లేదని  కొన్ని పత్రికలు రాశాయి. భారతీయ జనతా పార్టీ భావజాలానికి అనుగుణంగా ఇతని అలోచనలు లేనందునే పదవిలో కొనసాగించేందుకు ప్రధాన మంత్రి అంగీకరించ లేదని  కొన్ని పత్రికలు రాశాయి.
ఏది ఏమైనా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) నుంచి మేనేజ్ మెంట్ లో పట్టా పొందిన  సుబ్రమణియన్ ఆ తరువాత  చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి  పిహెచ్ డి  అందుకున్నారు.    
బ్యాంకుల పనితీరును పర్యవేక్షించేందుకు రిజర్వ్  బ్యాంకు   ఏర్పాటు చేసిన ఆర్థిక వేత్తల కమిటీకి సభ్యుడిగా పనిచేశారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్ మెంట్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నారు. కే.వి. సుబ్రమణియన్  తాజా నిర్ణయం  సర్వత్రా ఆసక్తి ని కలిగించింది

మరింత సమాచారం తెలుసుకోండి: