తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ఇవాళ జాతికి అంకితం చేశారు. మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌తో తెలంగాణలోని అనేక జిల్లాల్లో సిరులు పండుతాయన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్టుతో సాగవుతాని చెప్పారు. అయితే.. విపక్షాలు మాత్రం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. మల్లన్న సాగర్ ద్వారా వర్షాకాలంలో ఒక్క చుక్క కూడా రాదని.. ఒక టూరిజం స్పాట్ కోసం కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.


మల్లన్న సాగర్ ను సీఎం కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి అంకితం చేశారని.. మసిపూసి మారెడు కాయ చందంగా కేసీఆర్ వ్యవహరించారని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాళేశ్వరం నుంచి వర్షాకాలంలో మల్లన్న సాగర్ కు చుక్క రాదని.. కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు రావడానికి ఎన్ని రోజులు పడతాయని ఆయన ప్రశ్నించారు. సాధారణంగా సాంకేతికంగా ఎత్తి పోతల పథకాల రిజర్వాయర్ల కెపాసిటీ తక్కువగా ఉంటుందని.. కానీ.. మల్లన్న సాగర్ 50 టీఎంసీ లతో నిర్మించి సాంకేతికతకు తిలోదకాలు ఇచ్చారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.


మైదాన ప్రాంతంలో కట్టిన రిజర్వాయర్ వల్ల భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లితే.. జరిగే నష్టం ఊహించలేమన్న పొన్నాల లక్ష్మయ్య.. కాళేశ్వరం వల్ల ఇప్పటి వరకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. ఒకసారి ఎత్తిపోసిన నీళ్లను మళ్లీ సముద్రం పాలు చేశారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మల్లన్న సాగర్‌ కు అడ్డు పడేందుకు కొందరు కేసులు వేశారని కేసీఆర్ విమర్శించడాన్ని కూడా పొన్నాల లక్ష్మయ్య తప్పుబట్టారు.


అసలు ప్రజలకు ఇబ్బందులు లేకపోతే కోర్టులలో కేసులు ఎందుకు పడ్డాయని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేది ఎల్లంపల్లి ప్రాజెక్టేనని.. కానీ.. కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేశామనే .. ఇప్పటి వరకు ఎల్లంపల్లి ని జాతికి అంకితం చేయడం లేదని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేసేటట్లయితే.. 2013 చట్టానికి కేసీఆర్  ఎందుకు తూట్లు పొడిచారని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: