రాజకీయాల్లో బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవడం సర్వ సాధారణం. ఎప్పుడు ఎవరి దశ ఎలా ఉంటుందో కూడ చెప్పలేని పరిస్థితి రాజకీయాల్లో ఉంటుంది. ఇప్పుడు అదే రకమైన పరిస్థితిని, గందరగోళాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు. పార్టీ పరిస్థితి, తన పరిస్థితి ఎంత ఆందోళనకరంగా, ఎంత అయోమయంగా ఉన్నా చంద్రబాబు మాత్రం ఎక్కడా ఆ ఆందోళన పైకి కనిపించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆ పార్టీకి రానటువంటి ఘోరమైన ఫలితాలు మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చవిచూసింది. అయినా చంద్రబాబు ఎక్కడా అదరలేదు, బెదరలేదు.


 ఏదో ఒక ఉద్యమం, ధర్నాలు, పోరాటాలు, ఆందోళనల పేరుతో నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీనివల్ల పార్టీ క్యాడర్ చెక్కుచెదరని, ప్రజల్లోనూ, పార్టీ నాయకుల్లోనూ తెలుగుదేశం పార్టీపై నమ్మకం పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఘోరంగా అయోమయంగా  .. గందరగోళంగా ఉందనే చెప్పాలి. 70 ఏళ్ల వయస్సులో రాజకీయాలలో యాక్టివ్ గా ఉండడం ఆషామాషీ కాదు. చంద్రబాబు తన శక్తికి మించి ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయినా ఆయనకు తరచుగా అవమానాలు ఎదురవుతున్నాయి.


తన కొడుకు భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ధైర్యంగానే అడుగు ముందుకు వేస్తున్నారు. ఇప్పుడు ప్రజా చైతన్య యాత్ర పేరుతో జనాల్లో తిరుగుతున్నారు. దానిలో భాగంగా విశాఖ లో పర్యటించే ప్రయత్నం చేశారు. దీనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక విశాఖలో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొన్నారు. చంద్రబాబు మీద కోడిగుడ్లు, చెప్పులు పడ్డాయి. దీంతో తెలుగుదేశం క్యాడర్ కూడా ఆందోళన చెందారు. ఇక ప్రజలయితే చంద్రబాబు మీద దాడి జరగడంపై జాలిపడకపోగా గతంలో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి ఎన్టీఆర్ కు వైస్రాయ్ హోటల్ వద్ద ఎటువంటి అవమానం జరిగిందో అదే రకమైన అవమానం జరిగింది అంటూ గుర్తు చేసుకుంటున్నారు.


చేసిన పాపం ఊరికే పోదు కదా అని చర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం అమరావతిలోనూ ఇదే రకంగా చంద్రబాబు పై చెప్పులు దాడి జరిగింది. ఇప్పుడు విశాఖలోనూ ఇదే పరిస్థితి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడిగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈ పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. రాజకీయాల్లో చంద్రబాబు తన స్థాయిని మరిచి మరీ, రాజకీయ స్వలాభం తో పార్టీ నాయకులు అడ్డుకుంటూ విమర్శలు చేయడం, టిడిపి ప్రభుత్వంలో పార్టీ నాయకుల అవినీతిని అడ్డుకోకుండా మరింతగా ప్రోత్సహించడం, ప్రజల్లోకి ఈ విషయం బలంగా వెళ్లిపోవడంతో   చంద్రబాబు పరిస్థితి ఇబ్బందికరంగానే మారిపోయింది.


 అసెంబ్లీలోనూ, బయట చంద్రబాబు ఎప్పుడూ చూడని విధంగా అవమానాలు ఎన్నింటినో చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఆయనపై జాలి కలుగుతుంది. ఆయన సీఎంగా ఉండగా ఎన్ని రాజకీయ దిగజారుడు పనులైనా చేసి ఉండొచ్చు కానీ, ఏపీకి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి  వ్యక్తి పై ఈ విధంగా కోడి గుడ్లు, చెప్పులు పడడం విచారించదగ్గ విషయమే. చివరకు వాటర్ బాటిళ్లను సైతం విసిరి కొడుతూ జనాలు ఛీత్కరిస్తున్న వైనాన్ని బాబు కూడా దిగమింగుకుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబుపైన, ఆయన కొడుకు లోకేష్ పైనా సొంత పార్టీ నాయకులు కూడా అనుమానాలు మొదలయ్యాయి.

పార్టీని ముందుకు నడిపించే సత్తా చంద్రబాబు, లోకేష్ లకు లేదనే విషయాన్ని వారు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ రాజకీయ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. 70 సంవత్సరాల వయస్సులో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ.. పెద్ద దిక్కుగా రాజకీయాలు నడిపించాల్సిన చంద్రబాబు ఇంకా ఏదో సాధించాలనే తపనతో జనాల్లో తిరుగుతూ ఇలా అవమానాలు ఎదుర్కోవడం చూస్తుంటే కింద పడ్డా పైచేయి నాదే అని అనిపించుకునేందుకు చంద్రబాబు పడుతున్న ఆరాటాం... పోరాటం చూసి నిజంగానే జాలేస్తుంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: