తెలంగాణలో పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇక తాము అధికారంలోకి వచ్చేసినట్టే మాట్లాడారు. సంబరాలు చేసుకోవాలని కూడా పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఎక్సిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అధికారంలోకి వస్తోందని చెబుతున్నాయని.. ఈసారి ఫలితాలు తమకు అనుకూలంగా లేవనే సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రాలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రుడికి మబ్బులు పట్టాయన్న రేవంత్ రెడ్డి.. ఎగ్జిట్‌ పోల్స్ తప్పవుతాయంటున్న కేటీఆర్‌కు సవాల్ విసిరారు.


ఎక్సిట్ పోల్స్ తప్పంటున్నావు కదా.. ఒకవేళ అవి నిజమైతే నువ్వు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్తావా అంటూ కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్‌ విసిరారు. ఈరోజు 7 గంటల నుండే విజయోత్సవాలు జరుపుకోండని సూచించిన రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షం, పాలక పక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కేసీఆర్ గెలిస్తే రాజు, ఓడితే బానిస అనేలా పనిచేశారని కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.సమాజంలో అన్ని వర్గాలకు కాంగ్రెస్ విశ్వాసం కల్పిస్తుందని.. మీడియాకు కూడా ఈరోజు నుండి స్వేచ్ఛ లభిస్తుందని.. మేము పాలకులం కాదు.. సేవకులమని రేవంత్ రెడ్డి అన్నారు. 4 కోట్ల ప్రజలు మనకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చారని.. మనకు మొదటి, చివరి శత్రువు కేసీఆర్ కుటుంబంలోని నలుగురేనని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆరెస్ పార్టీకి ఎట్టిపరిస్థితుల్లోనూ 25 సీట్లు దాటవని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.


ప్రజలు నిద్రపోకుండా పహారా కాసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని.. కేసీఆర్ ను కామారెడ్డిలో ఓడకొట్టి నందుకు ప్రజలకు ధన్యవాదాలని.. ఓటమి అంచున ఉన్నప్పుడల్లా కేసీఆర్‌ స్థానాలు మార్చాడని రేవంత్ రెడ్డి అన్నారు. మావాళ్ళు వల వేసి ఇక్కడ ఓడగొట్టడం అభినందనీయమన్న రేవంత్ రెడ్డి.. కామారెడ్డి ఓటర్లు చైతన్యవంతులని ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కేసీఆర్‌ను ప్రజలు ఓడించారని అన్నారు. శ్రీకాంతచారి డిసెంబర్ 3నే తన తుదిశ్వాస వదిలాడని.. ఆరోజే ఎన్నికల ఫలితం రానుందని రేవంత్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: