రాజకీయాల్లో మాటలు చెప్పడం చాలా సులువు. పైగా ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం, ఓటర్లను అందలం ఎక్కించేలా మాట్లాడటం  మరీ సులువు. ఎన్నికల అయిన తర్వాత వాటిని నిలబెట్టుకోవడమే అసలైన పరీక్ష. కొందరైతే వాటిలో కొన్నింటిని గాలికి వదిలేస్తారు. కానీ మాటల్లో ఏం చెబుతున్నామో.. వాటిని చేసి చూపించడం మాత్రం కొందరికే సాధ్యం. అందుకు చాలా నిబద్ధత ఉండాలి. తాజాగా జగన్ చేసింది అదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


అవును తాజాగా ఇడుపుల పాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఎంపీ నందిగామ సురేశ్ ఎంపీ అభ్యర్థుల జాబితాను, మంత్రి ధర్మాన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం సీట్లు ఇవ్వడం ఇదే ప్రథమం అని తెలిపారు. స్వతంత్ర్య భారతంలో ఈ స్థాయిలో ఉన్న 200 సీట్లలో 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించడం చాలా గొప్ప విషయం అని ఈ ఘనత ఒక్క సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.


తాజాగా వైసీపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో 25 సీట్లకు బీసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు. 2019లో వీరికి 12 సీట్లు కేటాయించిన జగన్ ఈ సారి వాటి సంఖ్యను 16కు పెంచారు. ఇందులో 5గురు మహిళలు ఉన్నారు. ఇదే క్రమంలో 2019లో 89 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన సీఎం తాజాగా వాటిని రౌండ్ ఫిగర్ చేసి 100కి పెంచేశారు.


ఇందులో బీసీలకు 48 సీట్లు ఇవ్వడం గొప్ప విషయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  మొత్తంగా చూసుకుంటే బీసీలకు 59 స్థానాలు, ఎస్సీలకు 33, ఎస్టీలకు 8 కేటాయించి అసలైన సోషల్ ఇంజినీరింగ్ చేసి చూపించారు. ఇందులో 14మందికి పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు బీసీలకు న్యాయం టీడీపీతో అని చెప్పిన చంద్రబాబు ఈ రేంజ్ లో బీసీలకు సీట్లు ఇస్తారా అంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే కూటమి సమీకరణాలతో వీటిని సాధించడం కష్టమే. అందుకే మాటలు చెప్పడం వేరు.. వాటిని నిలబెట్టుకోవడం వేరు అని విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: