గత ఎన్నికల సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన కీలకమైన హామీ సూపర్ సిక్స్. వీటిలో ఆరు కీలకమైనటువంటి పథకాలను ఆయన ప్రకటించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. ఈ 6 అంశాలు ఎన్నికలను ప్రభావితం చేశాయి అన్నది వాస్తవం. వైసిపి పై వ్యతిరేకత ఎంత ఉందనేది పక్కన పెడితే చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ప్రజలు సానుకూలంగా ఉన్నారనేది గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి మనం చెప్పొచ్చు.

అయితే ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల్లో అమలైనవి చూసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్లను గత ఏడాది అక్టోబర్ నుంచి పంపిణీ చేస్తున్నారు. అదే విధంగా తాజాగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు. ఇక మిగిలిన నాలుగు పథకాలు విషయానికి వస్తే నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇప్పటివరకు ఈ నాలుగు అమలు కాలేదు. వీటిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఈ నెలలో ప్రారంభిస్తామని ప్రకటించారు. కాబట్టి అది ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో ముడిపడి ఉన్న వ్యవహారమని చంద్రబాబు తేల్చి చెప్పారు.


ఈ నెల‌లో కేంద్రం ప్రతి రైతుకు ఆరువేల రూపాయలు మూడు దఫాలుగా పంపిణీ చేస్తుంది. దాన్ని ఇందులో మినహాయిస్తే 14000 రూపాయలు మాత్రమే రైతులకు ప్రభుత్వం ఇస్తుంది. ఈ కార్యక్రమం అమలు చేయాల్సిందే. ఇక ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేది ఆగస్టు 15 నుంచి ప్రారంభం ఇస్తామని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ రెండు అమలు జరుగుతాయన్న విశ్వాసం ప్రజల్లోనూ ఉంది. కానీ మరో కీలకమైన రెండు ప‌థ‌కాలు నిరుద్యోగ భృతి, అదేవిధంగా ఆడబిడ్డ నిధి.


అనే ఈ రెండు విషయాలపై మాత్రం చంద్రబాబు ఒక రకంగా దాటవేత ధోర‌ణినే అవలంబించారనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఆడబిడ్డ నిధిని పి4 పథకం తో ముడిపెట్టారు. ఎన్నికలకు ముందు పీఫోర్ పథకాన్ని ప్రకటించినా దాని వివరాలను మాత్రం వెల్లడించలేదు. `ఎవరో వచ్చి ఏదో చేస్తారు` అనేటటు వంటిదే ఈ పి4 పథకం ప్రధాన సారాంశం. ఇప్పుడు వారంతా వచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటారా నెల 1500 రూపాయలు చొప్పున వారికి ఇస్తారా అనేది ప్రధాన చర్చ.


ఇక నిరుద్యోగ భృతిని నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ముడిపెట్టారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకునే వారికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తారా లేకపోతే వారికి ఉద్యోగాలు వచ్చేవరకు ఇస్తారా అనేది కూడా క్లారిటీ లేదు. ఈ రెండు విషయాలను పక్కన పెడితే అసలు మొత్తంగా సూపర్ సిక్స్ అమలు చేసేసామని దీనిపై ఎవరైనా మాట్లాడితే అవి నాలికమందం మాట‌లే అవుతాయని చంద్రబాబు సెలవిచ్చారు. ఇది ఏమేరకు సమంజసం? ఏ మేరకు ఇది కూటమి ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పథకాలు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఆర్థిక వెసులుబాటును బట్టి ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: