
రెండు దశాబ్దాలుగా పింఛన్లు తీసుకుంటున్న వారిని సైతం అకస్మాత్తుగా ‘అర్హులు కారు’ అంటూ ప్రభుత్వం తొలగించడం వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. అన్యాయానికి గురవుతున్నామంటూ దివ్యాంగులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉండేది. ప్రజల తరఫున బలమైన స్వరం వినిపించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కానీ, జగన్ మాత్రం ఈ అవకాశాన్ని పూర్తిగా వదిలేశారు. ఆయన స్పందన కేవలం ట్విట్టర్ సందేశానికే పరిమితమైంది. దివ్యాంగుల ఆందోళనల ఒత్తిడికి చివరికి ప్రభుత్వం వెనక్కి తగ్గి అందరికీ మళ్లీ పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ ఇష్యూలో ప్రతిపక్షం పాత్ర అసలు కనిపించలేదనే చెప్పాలి.
ప్రభుత్వం తీసుకున్న తప్పు నిర్ణయాన్ని సరిదిద్దించడానికి దివ్యాంగుల స్వతంత్ర పోరాటమే కనిపించిందే తప్పా వైసీపీ జోక్యం లేకపోవడం గమనార్హం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారితో భుజం కలిపి నిలబడే అవకాశం ఉన్నా, దానిని వదిలేయడం వైసీపీకి ప్రతికూలమే. ప్రస్తుతం దివ్యాంగులు గాని, పింఛన్ కోల్పోయినవారు గాని "మా కోసం వైసీపీ పోరాడింది" అని చెప్పే పరిస్థితి లేదు. వారి సొంత పోరాటమే ఫలించిందన్న భావన బలపడింది. రాజకీయంగా ఇలాంటి సందర్భాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రజల్లో క్రేజ్ వస్తుంది. ఈ విషయంలో వైసీపీ, జగన్ పూర్తిగా విఫలమైనట్టే కనిపిస్తోంది.