శంకరాభరణం. 1979లో రిలీజ్ అయిన అద్భుత కళాఖండం. ఈ మూవీ రిలీజ్ కి ముందు అన్నీ మాస్ సినిమాలే వరసగా వచ్చి బాక్సాఫీస్ ని బద్దలు కొడితే శంకరాభరణం సైలెంట్ గా వచ్చి అన్ని రికార్డులూ కొల్లగొట్టింది. తెలుగు  సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చింది. ఒక తెలుగు సినిమా భాషాభేదం లేకుండా యావత్తు ప్రపంచాన్ని ఆకట్టుకుందీ అంటే ఆ మ్యాజిక్ కళా తపస్వి కె విశ్వనాధ్ సొంతమనే చెప్పాలి.

శంకరాభరణం సినిమాకు మూలాధారం ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. ఇది ఒక నిజమైన సంగీత కళాకారుడి జీవితం నుంచి పుట్టిన కధ అంటే అంతా ఆశ్చర్యపోతారు. విజయవాడకు చెందిన గాయక సార్వభౌమ పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు గారి జీవితం నుంచి ప్రేరణగా తీసుకుని సినిమాటిక్ గా అల్లుకున్న కధ శంకరాభరణం అని చెబుతారు.

విజయవాడలో 19వ శతాబ్దంలో  పారుపల్లి రామక్రిష్ణయ్య గొప్ప  సంగీత స్రష్ట.  ఆయన‌  సంగీతానికి ముగ్దులు కాని వారు లేరు. ఆయన జీవితం సంగీతానికే అంకితం. ఆయనకు గొప్ప శిష్యుడుగా డాక్టర్ మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ ఉన్నరంటే కూడా ఆశ్చర్యపోవాలి. శంకరాభరణంలో చివరి సీన్ అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దొరకునా ఇటువంటి సేవ అన్న పాటలో శంకరశాస్రి జేవీ సోమయాజులు ఒక చరణం వరకూ పాడి అనారోగ్య కారణాన  రెండవ చరణం పాడలేకపోతే శిష్యుడి పాత్రలో ఉన్న తులసి వచ్చి అందుకుని మిగిలిన పాటను పూర్తి చేస్తుంది.

ఇది నిజజీవితంలో పారుపల్లి వారి అనుభవమేనట. 1942 జనవరి నెల 7వ తేదీన‌ తిరువయ్యూరులో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలకు హాజరైన పారుపల్లి వారు అప్పటికే అస్వస్థతతో ఉన్నారు. ఆయన  తన శిష్యుడు బాలమురళీని వేదిక ఎక్కించి కొన్ని కీర్తనలను  తనకు బదులుగా బాల మురళీతో అదే వేదిక మీదుగా పాడించారు. అప్పటికి బాలమురళీ వయసు పన్నెండు ఏళ్ళు. అలా తన శిష్యుడి గానానికి పరవశించిన పారుపల్లి వారి పాత్ర ఇక్కడ జేవీ సోమయాజులు పాత్రకు ప్రాణంగా మారిందన్న మాట. ఇదిలా ఉండగా శంకరాభరణం సినిమా హిట్ అయ్యాక విజయవాడ వచ్చిన కె విశ్వనాధ్ గాంధీనగర్ లో ఉన్న విశ్వనాధ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం విశేషంగా చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: