సుమారు 14 సంవ‌త్స‌రాల త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను ప్రోత్స‌హించేందుకు అవార్డులు ప్ర‌దానం చేయాలని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా 2024 సంవ‌త్స‌రానికి గానూ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్ర‌క‌టించారు. గురువారం ఉద‌యం గద్దర్ అవార్డు కమిటీ ఛైర్మెన్ జయసుధ విజేత‌ల పేర్ల‌ను అనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. అలాగే 2014 నుండి 2023 వరకు విడుదలైన తెలుగు సినిమాలను గౌరవిస్తూ సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీమోహ‌న్ ఆధ్వ‌ర్యంలో పెండింగ్‌లో ఉన్న అవార్డులు కూడా ప్ర‌క‌టించారు.


ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముర‌ళీ మోహ‌న్.. రెండు తెలుగు రాష్ట్రాల‌ను ఉద్ధేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించే విధంగా సినీ అవార్డులు ఇవ్వాలని మురళీ మోహన్‌ సూచించారు. అయితే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక సినిమాకే అవార్డులు ప్రకటిస్తే బాగుండ‌ద‌ని.. అలాగ‌ని ఒకే ఏడాది ఏపీలో ఒక సినిమాకు, తెలంగాణ‌లో మ‌రొక సినిమాకు అవార్డు ఇస్తే అనవసరమైన చర్చలు, లేనిపోని వివాదాలకు దారితీస్తుందని ముర‌ళీ మోహ‌న్ వివ‌రించారు.


అందువ‌ల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనకు వచ్చి.. ఒక ఏడాది తెలంగాణ ప్ర‌భుత్వం, మ‌రొక ఏడాది ఏపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించాలని మురళీ మోహన్ పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఏపీ, తెలంగాణ రెండు క‌ళ్ల‌లాంటివ‌ని.. ఒక‌టి ఎక్కువా, మ‌రొక‌టి త‌క్కువా కాదు.. రెండు రాష్ట్రాలు తమకు కావాల‌ని ముర‌ళీ మోహ‌న్ తెలిపారు. మ‌రి ఈ సీనియ‌ర్ న‌టుడి సూచ‌న‌పై ఏపీ, తెలంగాణ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: