
ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపింది. ఆ దెబ్బతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు బ్రేక్ వేసి తెలుగు చిత్ర పరిశ్రమకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు పొందే సాహసం నిర్మాతలు చేయలేదు. కానీ తాజాగా ఓ నిర్మాత ఆ సాహసానికి పూనుకున్నారు. ఆయన మరెవరో కాదు ఎ.ఎం.రత్నం. ఈయన నిర్మాణంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం `హరి హర వీరమల్లు`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.
ఫస్ట్ పార్ట్ ను జూన్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ రిలీజ్ వచ్చే నెలకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. ఏపీ పాలిటిక్స్ లో పవన్ బిజీగా మారడం వల్ల హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి కావడానికి ఏకంగా ఐదేళ్లు పట్టేసింది. నిర్మాత అనుకున్న బడ్జెట్ ఒకటైతే.. ఫైనల్ బడ్జెట్ మరొకటైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మంచి మనసుతో అడ్వాన్స్ గా తీసుకున్న రూ. 10 కోట్లు వెనక్కి ఇచ్చేశారు.
అయినప్పటికీ సినిమాకు పెట్టింది తిరిగి రావాలంటే చాలా కష్టపడాలి. ఈ నేపథ్యంలోనే ధైర్యంగా నిర్మాత ఎ.ఎం.రత్నం ఓ అడుగు ముందుకేశారట. హరి హర వీరమల్లుకు అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం పెట్టుకున్నారట. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారట. సో.. అదనపు రేట్లు, షోలకు అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని.. బన్నీతో ఆగిపోయింది, పవన్ తో మళ్లీ స్టార్ట్ అవ్వనుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నిజంగా హరిహర వీరమల్లుకు అనుమతులు వస్తే.. ఇకపై పెద్ద సినిమాలన్నటింకీ నిర్మాతలు అప్లికేషన్లు పెట్టుకోవడం ఖాయమే అవుతుంది.