టాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి కేంద్రబిందువుగా నిలిచే నిర్మాత బండ్ల గణేష్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని తన విలాసవంతమైన నివాసంలో ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించాడు. ఈ కార్యక్రమం హై - క్లాస్ స్థాయిలో జరిగినట్టు సమాచారం. సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వచ్చి బండ్ల గణేష్ పార్టీకి హాజరుకావడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవి రావడం అనేది బండ్ల రేంజ్, అతని వ్యక్తిగత సంబంధాల బలం ఏమిటో స్పష్టంగా చూపించింది.


ఈ పార్టీకి వెంకటేష్, సిద్దు జొన్నలగడ్డ, తేజా సజ్జా, అలాగే పలువురు యువ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు హాజరయ్యారు. మొత్తం మీద దాదాపు 60 మంది సినీ ప్రముఖులు ఒకే వేదికపై సందడి చేశారు. టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు సైతం వ‌చ్చారు. అంద‌రూ బాణాసంచా కాల్చుతూ, సంగీతం మధ్య హుషారుగా వేడుకలు జరుపుకున్నారు. రాత్రంతా నవ్వులు, చర్చలు, స్నేహాల సవ్వడితో బండ్ల ఇళ్లు నిండిపోయింది. బండ్ల గణేష్ విషయానికి వస్తే  గత కొన్నేళ్లుగా ఆయన లైమ్‌లైట్‌ నుంచి దూరంగా ఉన్నారు. నిర్మాతగా కూడా, నటుడిగా కూడా పెద్దగా యాక్టివ్‌గా లేరు. అయినా ఆయన పేరు సినీ వర్గాల్లో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. కారణం ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వం, బలమైన పరిచయ వలయం, అలాగే అతని బాండింగ్‌ స్కిల్స్‌. ఈసారి పార్టీని గట్టిగా ప్లాన్‌ చేసి, అందరికీ తెలిసేలా నిర్వహించడం వెనుక కూడా ఆయనకు ప్రత్యేక ఉద్దేశ్యం ఉందట.


ఇది కేవలం ముందస్తు దీపావళి వేడుక మాత్రమే కాదు, తాను మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నానని బండ్ల గణేష్ ఇచ్చిన స్పష్టమైన సంకేతం. పార్టీలో హాజరైన అతిథులతో మాట్లాడేటప్పుడు ఆయన తన రాబోయే ప్రాజెక్టుల గురించి కూడా ప్రస్తావించినట్లు సమాచారం. వింటున్న టాక్ ప్రకారం, ఈ సారి బండ్ల గణేష్ పెద్ద స్థాయిలో, క్రేజీ కాంబినేషన్లతో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట. గతంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ హిట్‌ను అందించిన ఆయన, ఆ తర్వాత కొన్ని విఫలాలు ఎదుర్కొన్నా, మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ఈ పార్టీ ద్వారా “నేను మళ్లీ వస్తున్నా – బండ్ల స్టైల్లో గర్జించబోతున్నా” అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఆయన కొత్త సినిమా ఎవరితో, ఎలాంటి స్కేల్‌లో ఉంటుందో అన్నదానిపైనే నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: