
ఒక విద్యార్ధి ఎలా రానించాలి అనే దానికి గతంలో పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులు ప్రత్యక్ష నిదర్శనం అయితే.. ఎలా ఉండకూడదో అనే దానికి మాత్రం నేటి కొత్త తరం విద్యార్థులే అందుకు నిదర్శనం అని ఈ కథనం చందివిన తర్వాత మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు రాయమంటే, బూతులు, ప్రేమ కవితలు, పాటలు రాస్తున్నారు నేటి కొత్త తరం విద్యార్థులు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన.
సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న వేళ, డిగ్రీ విద్యార్థుల సమాధాన పత్రాల్లో పాటలు, బూతులు, కవితలు, ప్రేమ గురించిన అంశాలను చూసి నివ్వెరపోయిన వాల్యుయేషన్ సిబ్బంది, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, పది మంది విద్యార్థులపై రెండేళ్ల సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని మల్దాలో ఉన్న బల్గన్ ఘాట్ లా కాలేజీలో జరిగింది. గత ఏడాది జరిగిన ఈ పరీక్షల్లో 150మంది హాజరవ్వగా, 40మంది మాత్రమే పాసయ్యారు.
దీంతో తమను పాస్ చేయలేదని సదరు విద్యార్థులు విధ్వంసానికి, హింసకు దిగారని, తప్పుడు జవాబులు రాయడమే కాకుండా తీవ్ర అభ్యంతరకరంగా వ్యవహరించడంతో వారిపై రెండేళ్ల సస్పెన్షన్ విధించాలని కఠిన నిర్ణయం తీసుకున్నామని వివరించారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోకుండా, ఇలా దురుసుగా ప్రవర్తించడం వల్ల ఈ ప్రభావం ఇతర ప్రాంతాలపై పడే అవకాశం కూడా ఉంటుందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తంతు కొనసాగితే మాత్రం ఇది దేశ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మారుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.