హైదరాబాద్ షాద్నగర్ లో జరిగిన దిశ అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసారు. కాగా దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రంలోని మహిళలందరికీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు సరికొత్త నిర్ణయం తీసుకొని భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ  క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలు చిన్నారుల భద్రత కోసం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. షాద్ నగర్ లో నలుగురు నిందితులు రాక్షసత్వానికి బలైన మృతురాలు దిశ పేరుతో సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది జగన్ సర్కార్. ఆడపిల్లలపై అఘాయిత్యాలు పాల్పడ్డ నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చేసేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. 

 

 

 

ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ఏపీ అసెంబ్లీ లో జగన్ సర్కార్ ప్రవేశపెట్టగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన దిశా  చట్టం పై టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని స్పందించారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం అమలు తనతోనే మొదలవ్వాలని డిమాండ్ చేశారు. మద్యం  నియంత్రణ అంశం గురుంచి  అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటల పై సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

 

 

 తనపై అనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్న వారిలో అధికార పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారని ఆమె ఆరోపించింది. దిశ చట్టం తనతోనే మొదలవ్వాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను  అంటూ టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సభలో పేర్కొన్నారు. ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాగా టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని 2019 ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: