అమరావతి: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు అక్కడ గెలుపు తమదేనంటూ దీమాలో ఉన్నాయి. మరోపక్క బీజేపీ, జనసేన పార్టీలు సైతం తిరుపతిలో గెలుపు కోసం సన్నాహాలు చేస్తున్నాయి. ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే జనసేన, బీజేపీలు దూకుడును పెంచేశాయి. ఎన్నికల్లో బీజేపీ నుంచి అభ్యర్థిని దింపాలా లేక జనసేన నుంచి దింపాలా అనే తర్జన భర్జనలో ఉన్నాయి. ప్రస్తుతం రెండు పార్టీలు కూడా తిరుపతి బరిలో నిలిచేందుకు ఆరాటపడుతున్నాయి. అయితే బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉండటంతో ఉమ్మడి అభ్యర్థి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. బరిలో ఎవరు నిలిచినా కానీ అభ్యర్థి గెలుపు కోసమే ఇరు పార్టీలు పనిచేయాలని అనుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవల పవన్ కల్యాణ్, బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో భేటీ అయ్యారు.

తిరుపతి లోక్ సభ అభ్యర్థితో పాటు రాష్ట్రంలో నెలకొన్న అనేక పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్, సోము వీర్రాజు కలిసి తిరుపతి అభ్యర్థిని ఖరారు చేసేశారంటూ చర్చ నడుస్తోంది. అయితే ఆ అభ్యర్థి మహిళ అని, రాజకీయ నేపథ్యం కూడా లేని వారని తెలుస్తోంది. ఇంతకూ ఆమె ఎవరంటే.. కర్ణాటక మాజీ సీఎస్ రత్న ప్రభ. అవును రత్న ప్రభను తిరుపతి బరిలో నిలపాలని జనసేన, బీజేపీలు ఆలోచిస్తున్నాయట. వారి పరిశీలనలో ఉన్న పేర్లలో ముందు వరుసలో రత్న ప్రభ పేరే ఉందంట. ప్రకాశం జిల్లాకు చెందిన రత్న ప్రభ కర్ణాటక రాష్ట్రంలో అనేక కీలక బాధ్యతలను నిర్వహించారు. అంతేకాదు కర్ణాటక రాష్ట్ర సీఎస్‌గానూ ఆమె పనిచేశారు. పదవీ విరమణ చేసేసిన తర్వాత కూడా వృత్తి నైపుణ్య అథారిటీ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తించారు.

అంతేకాకుండా డిప్యుటేషన్‌పై ఏపీలో కూడా రత్న ప్రభ కొంత కాలం పాటు పనిచేశారు. రత్న ప్రభకు ఫైర్ బ్రాండ్‌గా పేరు ఉండటంతో.. ఆమె అయితే విజయం సాధించడం తథ్యం అని బీజేపీ, జనసేనలు భావిస్తున్నాయట. వైసీపీ అభ్యర్థిని రత్న ప్రభ సమర్థవంతంగా ఎదుర్కోగలరని ఇరు పార్టీలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వాన్ని ఉభయ పార్టీలు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రత్న ప్రభ కుటుంబంలోనూ అందరూ విద్యావంతులే. ఆమె తండ్రి కత్తి చంద్రయ్య, భర్త విద్యా సాగర్, సోదరుడు ప్రదీప్ చంద్ర ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులుగా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: