ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లు, పుర‌పాల‌క సంఘాలు, న‌గ‌ర పంచాయితీల‌కు సంబంధించిన ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచ‌ల‌న విజ‌యాలు సాధిస్తోంది. తెలుగుదేశం, జ‌న‌సేన‌-బీజేపీ ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోతున్నాయి. కొన్ని పుర‌పాల‌క సంఘాల్లో వైసీపీ, తెలుగుదేశం మ‌ధ్య హోరాహోరీ పోరు సాగిన‌ట్లు ఫ‌లితాలను ‌బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన కొన్ని ప్రాంతాల్లో త‌న ప్ర‌భావం చూపించ‌గ‌లిగింది.

ఛైర్‌ప‌ర్స‌న్ అభ్య‌ర్థి ఓట‌మి
లెక్కింపు సంద‌ర్భంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురం ఓట్ల లెక్కింపు కేంద్రం వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎమ్మెల్యే జోగారావును లెక్కింపు కేంద్రంలోకి అనుమ‌తించార‌న్న స‌మాచారం అందుకున్న ఎమ్మెల్సీ జ‌గ‌దీశ్వ‌ర‌రావు త‌న అనుచ‌రుల‌తో క‌లిసి అక్క‌డికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ లెక్కింపు కేంద్రంలోకి వెళ్లేందుకు  ప్ర‌య్న‌తించ‌గా పోలీసులు అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తాయి. పోలీసుల‌కు, జ‌గ‌దీశ్వ‌ర‌రావుకు తోపులాట జ‌ర‌గ‌డంతో ఆయ‌న చొక్కా చినిగిపోయింది. ఎమ్మెల్యే, డీఎస్పీ స‌ర్దిచెప్ప‌డంతో ఎమ్మెల్సీ అక్క‌డినుంచి వెళ్లిపోయారు. ఇదే జిల్లా నెల్లిమ‌ర్ల‌లో ఛైర్‌ప‌ర్స‌న్ అభ్య‌ర్థిగా పోటీచేసిన మ‌హాల‌క్ష్మి ఓట‌మిపాల‌వ‌డం వైసీపీ శ్రేణుల‌ను దిగ్ర్భాంతికి గురిచేసింది. ఇక్క‌డ మొత్తం 20 వార్డులున్నాయి.

ప్ర‌కాశంలో కొన‌సాగిన హ‌వా
ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ త‌న హ‌వాను కొన‌సాగించింది. గిద్ద‌లూరు, చీమ‌కుర్తి, క‌నిగిరి న‌గ‌ర పంచాయితీల‌ను తిరుగులేని విజ‌యంతో కైవ‌సం చేసుకుంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీని కూడా వైసీపీ గెలుచుకుంది. ఇక్క‌డ మొత్తం 23 వార్డుల‌కు గాను వైసీపీ 15, తెలుగుదేశం 7, బీజేపీ ఒక స్థానంలో విజ‌యం సాధించాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీని చాలా సుల‌భంగా వైసీపీ గెల‌వ‌గ‌లిగింది. మొత్తం 25 వార్డుల‌కుగాను 23 గ‌తంలోనే ఏక‌గ్రీవ‌మ‌య్యాయి. వీటిలో వైసీపీ 21, తెలుగుదేశం 1, బీజేపీ 1 ఏక‌గ్రీవం చేసుకోగ‌లిగాయి. ఎన్నిక‌లు జ‌రిగిన రెండు వార్డుల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంది. రాత్రి ఎనిమిది గంటల్లోగా ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ పూర్తిచేయాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: