సోనియా గాంధీ ఆధ్వర్యంలో  ప్రతిపక్షాల సమావేశం నిర్వహించారు. వీడియో సమావేశం ద్వారా సమాలోచనలు చేస్తున్నారు సోనియా గాంధీ. ఇక ఈ సమావేశంలో మొత్తం 19 ప్రతిపక్ష పార్టీ లు  పాల్గొన్నాయి.  అధికార బిజేపి ని దీటుగా  ఎదుర్కుని నిలువరించేందుకు, భావసారూప్యతగల పార్టీ లన్నింటినీ ఏకం చేసి, మరింత బలీయమైన ఉమ్మడి పోరుకు సన్నధ్దమౌతోంది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాలలో మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసిన ఉమ్మడి పోరు ను మరింత సమర్ధవంతంగా కొనసాగించేందుకు, ప్రతిపక్షాల ఐక్యతను పటిష్టంచేసేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు.  

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యపక్షంగా ఉండి అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ సమావేశానికి రావాలని ఆహ్వానాలు పంపారు. అయితే ఈ సమావేశం లో  తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కే. స్టాలిన్ ( డి.ఎమ్.కె), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్దవ్ థాకరే (శివసేన), ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ( జార్ఖండ్ ముక్తి మోర్చా)   సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తో పాటు  శివసేన పార్టీ కూడా పాల్గొంది. అయితే,ఆప్, ఎస్.పి, బి.ఎస్.పి పార్టీలు  హాజరు కాలేదు.  

ప్రస్తుత పరిస్థితులలో ప్రతిపక్షాల  ఉమ్మడి పోరు, ఐక్యత బలంగా కోరుకుంటున్నప్పటికీ, గాంధీ కుటుంబ నాయకత్వం పట్ల వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు కొంత మంది నేతలు. అయితే , ప్రతిపక్షాల ఐక్యత కోసం, ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసిన
రాహుల్ గాంధీ... పార్లమెంట్ సమావేశాల సందర్భంగా, ఉదయం ప్రతిపక్షాల నేతలతో అల్పాహార సమావేశాన్ని స్వయంగా  నిర్వహించడంతో పాటు, ప్రతిపక్షాల సమావేశాలలో పలుమార్లు పాల్గొన్నారు.   పలు నిరసన ప్రదర్శన లో కూడా చురుగ్గా పాల్గొన్న రాహుల్ గాంధీ... రైతుల ఆందోళనకు మద్దతుగా ట్రాక్టర్ పై, పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్ పై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరై,  నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే, ప్రతిపక్షాల ఐక్యత పటిష్టంగా ఉంటుందని పేర్కొంటున్నాయి పలు ప్రతిపక్షాలు. అయితే ఈ చర్చలు ఎలా ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: