నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో కరోనాకు ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తుండ‌టంతో ప్ర‌జ‌లు కిలోమీట‌ర్ల మేర క్యూ క‌డుతున్నారు. రెండోద‌శ‌లో క‌రోనా ఎంత ఉధృతంగా ఉందో.. ఏపీలో పాజిటివిటీ రేటు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. అయినా ప్ర‌జ‌లు మాత్రం ఆలోచ‌న లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఈ సంఘ‌ట‌న‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎవ‌రికివారు బాధ్య‌త తీసుకుంటేనే క‌రోనా నుంచి త‌ప్పించుకొని మ‌నుగ‌డ సాగించ‌గ‌లిగే ప‌రిస్థితి ఉందంటే అతిశ‌యోక్తికాదు. అయినా ఎవ‌రో చెప్పారంటూ వాస్త‌వాన్ని నిర్థార‌ణ చేసుకోకుండా.. ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోయిన‌వారు కూడా కోలుకుంటున్నారంటూ ఒక‌రిపై ఒక‌రు ప‌డుతూ.. మాస్క్‌లు లేకుండా.. భౌతికదూరం పాటించ‌క‌పోవ‌డాన్ని చూస్తుంటే ఇదేనా మ‌న జ‌నాల భార‌తం అనిపిస్తోంది.

మ‌న‌ద‌గ్గ‌ర దొరికేవాటితోనే మందు త‌యారీ!!
మ‌న గ్రామాల్లో దొరికే వస్తువులతోనే ఈ మందును తయారు చేస్తున్నట్లు ఆయుర్వేద వైద్యులు బోగిని ఆనందయ్య చెబుతున్నారు. తేనే, మిరియాలు, పచ్చకర్పూరం, జాజికాయ, నల్ల జీలకర్ర, దాల్చిన చెక్కను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నకొంతమంది ఈ మందులు త‌యారుచేసేందుకు ఆనందయ్యకు స‌హ‌క‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. మందుల తయారీలో ఉపయోగించే వస్తువులు దొర‌క‌న‌ప్పుడు త‌మంత‌ట‌తామే సొంతంగా తెచ్చి డాక్ట‌ర్ ఆనంద‌య్య‌కు అందిస్తున్నారు. ఈ మందు తీసుకోవ‌డంవ‌ల్లే తాము క‌రోనా నుంచి కోలుకున్నామంటూ అక్క‌డికి వ‌చ్చిన చాలామంది నొక్కి వ‌క్కాణిస్తుండ‌టంతో ఈ వార్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌కు దావాన‌లంలా పాకింది.

మూడు రాష్ట్రాల నుంచి పోటెత్తుతోన్న ప్ర‌జ‌లు
ఏపీతో పాటూ తమిళనాడు, తెలంగాణ నుంచి కూడా ప్ర‌జ‌లు ఈ ఆయుర్వేద మందుకోసం భారీగా తరలివస్తున్నారు. ఉదయం నుంచే రద్దీ నెల‌కొంటోంది. ఈ ఔష‌ధాన్ని తీసుకోవ‌డంవ‌ల్ల ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన వ్యక్తులు కూడా కోలుకుంటున్నారని చెబుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పంపిణీ జ‌రుగుతోంది. కరోనా రోగులు పూర్తిగా కోలుకుంటున్నారని.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెబుతున్నారు. దీనిపై అధికారులు ఇప్ప‌టికే అన్ని వివ‌రాలు సేక‌రించారు. కొంతమంది మాత్రం తాము కరోనా నుంచి కోలుకున్నామని ఘంటాప‌థంగా చెబుతుండ‌టంతో వారికేమీ పాలుపోవ‌డంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: