
ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై టీడీపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు అది జాబ్ లెస్ క్యాలెండర్ అని ఒకరు అంటుంటే నిరుద్యోగులను మభ్యపెట్టడం కోసమే... ఇలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మరొకరు అంటున్నారు. అంతే కాకుండా కొత్త జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ర్టంలో ఉన్న నిరుద్యోగులను నిలువునా ముంచేలా ఈ జాబ్ క్యాలెండర్ ఉందని ఎద్దేవా చేస్తున్నారు.
అయితే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఈ జాబ్ క్యాలెండర్ పై సోషల్ మీడియా వేధిక ట్విటర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ.... అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడడం ఆపి.. మంత్రులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. జాబ్ లెస్ క్యాలెండర్ కాకుండా జాబ్స్ ఉన్న క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగులను ఇంకా కష్టాల పాలు చేయొద్దని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై భిన్న రీతిలో స్పందిస్తున్నారు.