సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలుగు తేజం జస్టిస్ ఎన్‌.వి. రమణ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే ఓ సాహసిక నిర్ణయం తీసుకున్నారు. మరో పురుషునితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని న్యాయమూర్తిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే తొలిసారి ఓ గే జడ్జిగా నియమితులు కాబోతున్నారు. ఈమేరకు జస్టిస్ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.


ఇంతకీ ఆ గే న్యాయమూర్తి ఎవరంటారా..? ఆయనే ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాది సౌరభ్ కృపాల్‌. ఈ సీనియర్ న్యాయవాదిని హైకోర్టు జడ్జిగా సిఫారసు చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ సౌరభ్ కృపాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేయాలన్న నిర్ణయం ఇప్పటిదేమీ కాదు.. గత మూడేళ్ల క్రితమే ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే.. అప్పట్లో కొలీజియం సౌరభ్ కృపాల్‌ ను న్యాయమూర్తిగా సిఫారసు చేసే సాహసం చేయలేకపోయింది. ఎందుకంటే.. సౌరభ్ కృపాల్‌ ఓ గే.. ఈ విషయాన్ని ఆయన ఏమీ దాచుకోరు.


అంతే కాదు.. ఈ సౌరభ్ కృపాల్.. గే ల హక్కుల కోసం చాలా కాలం న్యాయపోరాటం చేశారు కూడా. ఈ సౌరభ్ కృపాల్ ఎవరో కాదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీ ఎన్‌ కృపాల్‌ కుమారుడే. 2017లోనే సౌరభ్ కృపాల్ పేరును ఢిల్లీ హైకోర్టు సిఫారసు చేసింది. ఆ సిఫారసును ఇన్నాళ్లూ కొలీజియం పక్కకు పెట్టింది. ఇప్పుడు సీజీఐ ఎన్‌వీ రమణ చొరవతో ఈ ప్రతిపాదన ఇప్పడు కార్య రూపం దాలుస్తోంది.


సౌరభ్ కృపాల్.. విదేశీ ఎంబసీలో పని చేస్తున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. లైంగిక స్వేచ్ఛ అనేది వ్యక్తిగత స్వేచ్చ అని నమ్మే సౌరభ్ కృపాల్.. గే లకు కూడా అన్ని హక్కులు ఉండాలని వాదించారు. ఎల్‌జీబీటీల హక్కుల కోసం న్యాయ పోరాటం సాగించారు. ఇప్పుడు ఆయన హైకోర్టు న్యాయమూర్తి కాబోతున్నారు. మన దేశంలో న్యాయమూర్తిగా నియమితులు కాబోతున్న తొలి జడ్జిగా సౌరభ్ కృపాల్ రికార్డు సృష్టించారంటే.. అందులో మన సీజేఐ నూతక్కి వెంకట రమణ పాత్ర తక్కువేమీ కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: