దావోస్‌ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. వర్చువల్ ద్వారా ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. స్టేట్ ఆఫ్‌ ద వరల్డ్‌ అంశంపై ప్రసంగించారు. అంతర్జాతీయ యవనికపై భారత్‌ అభివృద్ధిని చాటారు. భారత్ అద్భుతంగా ప్రగతి సాధిస్తోందన్న మోదీ.. ఈ శతాబ్దానికే భారత్ సాధికారత కల్పిస్తోందని అన్నారు. కరోనా సమయంలో ఇండియా సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు.


భారత్‌లో ఏడాదిలో 160 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. భారత్‌లో ప్రస్తుతం కొవిడ్‌ మూడో దశ నడుస్తోందన్న ప్రధాని మోదీ కొవిడ్‌ సమయంలోనూ సంస్కరణలు అమలు చేశామన్నారు. భారత్‌ ఆర్థికపరంగా ఆశావహ దృక్పథంతో ముందుకెళ్తోందని.. అలాగే ప్రపంచానికి కూడా భారత్‌ ఆశావహ దృక్పథం కల్పిస్తోందని ప్రధాని మోదీ  భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంపై భారతీయులకు గట్టి నమ్మకం ఉందన్న ప్రధాని ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ భారత్‌లో ఉందని సగర్వంగా తెలిపారు.


గత నెలలో యూపీఐ ద్వారా భారత్‌లో 440 కోట్ల లావాదేవీలు జరిగాయని.. మూడో అతిపెద్ద ఫార్మా ఉత్పత్తిదారుగా భారత్‌ నిలిచిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. వన్‌ ఎర్త్‌-వన్‌ హెల్త్‌ నినాదంతో కోట్లాది ప్రజల ప్రాణాలు నిలిపామని.. భారత్‌ ప్రపంచ దేశాలకు ఔషధాలు, వ్యాక్సిన్ల సరఫరా చేసిందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకుంటోందని.. భారతీయులకు ప్రజాస్వామ్యంపై అచంచల విశ్వాసం ఉందని ప్రధాని అన్నారు.


21వ శతాబ్దికి సాధికారత కల్పించే సాంకేతికత భారత్‌ వద్ద ఉంద్న ప్రధాని... కరోనా వల్ల ఆర్థిక, సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కరోనా పరిణామాలపై జీ20 సదస్సులో చర్చలు జరగాలని.. ప్రపంచ మేలు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ప్రధాని మోదీ  పిలుపు ఇచ్చారు. మొత్తానికి ఈ శతాబ్దం ఇండియాదే అంటూ ప్రధాని మోదీ సాధికారంగా ప్రసంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: