
మొదట యుద్ధం కోసం ఉవ్విళ్లూరిన పాక్.. భారత్ దాడులను ఇటు తట్టుకోలేక, అటు తిప్పికొట్టలేక అల్లాడిపోయింది. ఆర్థికంగా చితికిపోయింది. భారత్‌తో కాళ్ల బేరానికి వచ్చింది. అయితే భారత్ వెనక్కి తగ్గుతుందని ఎవరూ ఊహించలేదు. కాల్పులు, మిస్సైల్ దాడులతో ఇరుదేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో అనుహ్యంగా శనివారం సైనిక ఘర్షణలకు తెరదించుతూ భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
కాల్పుల విరమణ వార్త వెలువడిన వెంటనే నెట్టింట మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యుద్ధాన్ని నివారించడానికి కొందరు స్వాగతిస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాతో యుద్ధానికి పాక్ వెనక తగ్గడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో దారుణంగా దిగజారిన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు పాక్ ఇటీవల ఇంటర్నేషన్ మానిటరీ ఫండ్‌కి అప్పు కోసం వెళ్లింది. భారత్ అప్పు మంజూరు చేయొద్దని చెప్పినా.. IMF రూ.8500 కోట్ల రుణం ఇచ్చింది. అదే సమయంలో భారత్ తో యుద్దం విషయంలో వెనక్కి తగ్గాలని కండీషన్ పెట్టింది.
అలాగే అమెరికా అనుమతి లేకుండా IMF పాకిస్తాన్‌కు లోన్ మంజూరు చేయదు. ఈ నేపథ్యంలోనే అమెరికా సైతం భారత్‌పై దాడుల విషయంలో పాక్‌కు అక్షింతలు వేసింది. అమెరికా జోక్యంతోనే భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం అదుపులోకి వచ్చింది. పాక్ వెనక్కి తగ్గడానికి బలమైన కారణమే ఉన్నా.. భారత్ ఎందుకు కాల్పల విరమణకు అంగీకరించో అర్థం కాని పరిస్థితి. అసలు యుద్ధం ఎందుకు మొదలు పెట్టినట్టు? ఏం సాధించినట్టు? శత్రువు బలహీనంగా మారాక ఎందుకు వదిలేసినట్లు? అన్న ప్రశ్నలు మోదీ ప్రభుత్వంపై వెల్లువెత్తున్నాయి. పాక్ కు ఈసారి భారత్ శాశ్వత గుణపాఠం చెబుతుందని దేశపౌరులు ఎంతగానో ఆశపడ్డారు. కానీ వారి ఆశ చిరవకు నిరాశే అయింది.