ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఫుల్ ఫోకస్ అమరావతిపైనే పెట్టింది. 2029 ఎన్నికల నాటికి తొలి దశ పనులు పూర్తయ్యేలా చేయాలని, ఏదో రూపురేఖలు కనపడేలా తీర్చిదిద్దాలని పట్టుదలగా ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వల్ల వచ్చే ప్రయోజనాలు కూడా కూటమికి అదనపు బలం కల్పిస్తున్నాయి. మొత్తానికి “అమరావతి – మన గౌరవం” అన్న నినాదంతో ముందుకు సాగుతోంది. అయితే రాజధాని విషయంలో వైసీపీ సైలెంట్‌గా గేమ్ మార్చింది. గతంలోలా “అమరావతి వద్దు” అనే లైన్ వద్దు, ఇప్పుడు “ఖర్చు ఎక్కువ” అనే కొత్త స్టాండ్ తీసుకుంది. అంతేకాదు, మేము వచ్చినా అమరావతినుంచే పాలిస్తాం అని కూడా చెబుతోంది. ఇలాగే సైలెంట్‌గా అంగీకరిస్తూ కూడా కౌంటర్ లాజిక్ వేసి కూటమిని గిలగిల కొడుతోంది.


వైసీపీ లాజిక్ ఏమిటంటే – అమరావతి రాజధాని కోసం లక్షల కోట్లు కావాలి. కాని అదే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి 5,000 కోట్లు పెట్టలేకపోతోందట. ఈ లోటు తీర్చేందుకు పీపీపీ మోడల్ తెచ్చుకుందట. “పదిహేడు మెడికల్ కాలేజీలు కేవలం 5,000 కోట్లతో వస్తాయి. ఆ డబ్బులు పెట్టలేని సర్కార్, లక్షల కోట్ల రాజధాని ఎలా కడుతుంది?” అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ లాజిక్ వినగానే జనంలో కూడా “నిజమే కదా” అన్న భావన కలుగుతోందట. ఇదే పాయింట్‌ని పట్టుకుని వైసీపీ నేతలు కూటమిని చిత్తు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే నేరుగా “చంద్రబాబు జన్మలో అమరావతి కట్టలేరు. మెడికల్ కాలేజీలకే డబ్బులు లేని వారు రాజధాని నిర్మాణం ఏంట్రా బాబు!” అని బాంబ్ పేల్చేశారు. ఇలాంటి కౌంటర్‌లు వేస్తూ వైసీపీ ప్రజల్లో ఒక డౌటును నాటుతోంది.



ఇక కూటమి వర్గాల సంగతి వేరే. “రాజధాని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. రాష్ట్ర భవిష్యత్తు. అందుకే పెద్ద ఎత్తున రుణాలు తీసుకురావాల్సి వస్తోంది” అని చెబుతున్నా, వైసీపీ వేసిన ప్రశ్నలకు క్లియర్ ఆన్సర్ చెప్పలేక ఇబ్బంది పడుతున్నట్టే ఉంది. మొత్తానికి, అమరావతిపై కూటమి పటిష్ట అడుగులు వేస్తున్నా, వైసీపీ వేసిన “మెడికల్ కాలేజీల లాజిక్” ఒక్కటే రాజకీయంగా పెద్ద ముళ్లుగా మారుతోంది. ఈ డౌట్‌ని పక్కన పెట్టి అమరావతిని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తారా? లేక వైసీపీ కౌంటర్‌లతో మళ్ళీ ఇరుక్కుపోతారా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మిలియన్ డాలర్ ప్రశ్న!

మరింత సమాచారం తెలుసుకోండి: