
పరిస్ధితి చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి రికార్డు మెజారిటితో గెలిచిన విషయం తెలిసిందే. లోక్ సభ చరిత్రలోనే వైసీపీ అభ్యర్ధి అత్యధిక మెజారిటి సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవం ఇలాటుంటే చంద్రబాబు మాత్రం వైసీపీ నేతల అహాన్ని ఉపఎన్నిక ఫలితం అణిచేసిందంటు విచిత్రమై ట్వీట్ చేశారు. 5 లక్షల ఓట్ల మెజారిటి సాధిస్తామని చెప్పిన వైసీపీ నేతల అహంకారానికి జనాలు తమ ఓటుతో బుద్ధిచెప్పారట. ఉపఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడం వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతకు నిదర్శనమంటు పిచ్చి ట్వీట్లు పెట్టాటమే విచిత్రంగా ఉంది.
ఏ ఎన్నికలో అయినా తమకు వచ్చే మెజారిటి గురించి అభ్యర్ధులు అంచనాలు వేసుకోవటం చాలా సహజం. అంతమాత్రాన అభ్యర్ధులు అంచనా వేసినట్లు మెజారిటి రాకపోతే ఇక అభ్యర్ధినో లేకపోతే పార్టీనో జనాలు తిరస్కరించినట్లేనా ? ఇక్కడ మెజారిటికన్నా గెలుపే ముఖ్యం. ఓట్లేసి జనాలు గెలిపించారా లేదా అన్నదే ఎవరైనా చూస్తారు. నిజనికి మంత్రులు, నేతలు అంచనా వేసుకున్నట్లు 5 లక్షల ఓట్లు మెజారిటి రాలేదన్నది వాస్తవమే. అయితే అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మొదటిది పెరిగిపోయిన కరోనా సెకెండ్ వేవ్ ఉదృతి. రెండోది మండిపోతున్న ఎండలు. ఇక మూడో కారణం అధికారపార్టీ ఓటర్లకు ప్రత్యేకించి డబ్బులు పంపిణీ చేయకపోవటం. కారణాలు ఏవైనా 2019 ఎన్నికల్లో జరిగిన 80 శాతం ఓటింగ్ తో పోలిస్తే తాజా పోలింగ్ లో నమోదైన ఓటింగ్ 64 బాగా తక్కువనే చెప్పాలి.
2019లో 14 లక్షల ఓట్లు పోలైతే ఇపుడు పోలైంది 11 లక్షల ఓట్లే. అంటే మూడు లక్షల ఓట్లు పోలింగ్ జరగలేదని అర్ధమవుతోంది. మరి పోలింగ్ తగ్గిపోయినపుడు పార్టీల ఓటుషేర్ కూడా తగ్గిపోతుంది కదా ? గెలిచిన అభ్యర్ధికి వచ్చిన మెజారిటి ఎంతన్నది జరిగిన పోలింగ్ పైనే కదా ఆధారపడేది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఓవరాల్ పోలింగ్ తగ్గినా వైసీపీ ఓటుషేర్ పెరిగింది. అలాగే తగ్గిన పోలింగ్ తో పోల్చితే వైసీపీకి వచ్చిన మెజారిటి పెరిగింది. 2019-2021 ఎన్నికల ఓటింగ్ ను గమనిస్తే వైసీపీకి 1.7 శాతం పెరిగింది. ఇదే సమయంలో టీడీపీని తీసుకుంటే వచ్చిన ఓట్లూ తగ్గింది, ఓట్లశాతమూ తగ్గిపోయింది. పోయిన ఎన్నికల్లో టీడీపీకి 37.56 శాతం ఓట్లు వస్తే తాజా ఎన్నికల్లో వచ్చింది 32.09 శాతం ఓట్లే. అంటే ఏకంగా 5.47 శాతం ఓట్లు తగ్గింది. ఓట్లు, ఓట్లశాతం టీడీపీకి తగ్గిపోతే చంద్రబాబు మాత్రం వైసీపీకి తగ్గిందని చెప్పటమే విచిత్రంగా ఉంది.