ఐపీఎల్ 2025 సీజన్‌లో ఓ కుర్రాడు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అతని పేరు వైభవ్ సూర్యవంశీ. వయసు కేవలం 14 ఏళ్లు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న ఈ బుడతడు, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ దెబ్బతో ఐపీఎల్ చరిత్రలోనే పిన్న వయసులో, అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేనా, అరంగేట్రం మ్యాచ్‌లోనే తొలి బంతికే సిక్సర్ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతని దూకుడైన బ్యాటింగ్ శైలి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిపెట్టింది.

అయితే, ఇన్ని ఘనతల మధ్య ఓ విచిత్రమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ క్రికెట్ సంచలనం పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. ఇంకొందరైతే అతని చదువుపై మీమ్స్ చేస్తూ, "విద్యాశాఖ బోర్డుపై DRS (డెసిషన్ రివ్యూ సిస్టమ్) తీసుకుంటాడేమో" అని, "థర్డ్ అంపైర్ పాసో ఫెయిలో తేలుస్తాడు" అంటూ జోకులు పేల్చారు. CBSE బోర్డు ఫలితాలు వెలువడిన తర్వాత ఈ పోస్టులు వైరల్ అయ్యాయి.

వైభవ్ పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అసలు విషయం ఏంటంటే, అతను ఇంకా పదో తరగతి పరీక్షలే రాయలేదు, ఎందుకంటే ప్రస్తుతం తొమ్మిదో తరగతిలోనే చదువుతున్నాడు. వైభవ్ ప్రస్తుతం తాజ్‌పూర్‌లోని మోడెస్టీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. అంతకుముందు ఇదే పాఠశాలలో 8వ తరగతి పూర్తిచేశాడు. కాబట్టి, అతను పదో తరగతి ఫెయిల్ అయ్యాడంటూ వైరల్ అవుతున్న పోస్టులు పూర్తిగా అవాస్తవం, తప్పుదారి పట్టించేవి.

బీహార్‌లో పుట్టిన వైభవ్, చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. ఐదేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. అతని ప్రతిభను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు, ఐపీఎల్ 2025 వేలంలో ఏకంగా రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. చిన్న వయసులోనే వైభవ్, భారత క్రికెట్‌లో భవిష్యత్ తారగా ఎదుగుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: