
ఐపీఎల్ 2025 ఉత్కంఠభరిత దశలోకి ప్రవేశించింది. లీగ్ దశ ముగిసిన తర్వాత నాలుగు జట్లు ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తమ అద్భుతమైన ప్రదర్శనతో అగ్రస్థానాల్లో నిలిచి పోటీని మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ జట్ల మధ్య ఇప్పటికే తీవ్ర పోటీ నెలకొనగా, ఫైనల్‌లో ఎవరు తుది పోరులో అడుగుపెడతారనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
ప్లేఆఫ్స్ షెడ్యూల్ ప్రకారం, మే 29న చండీగఢ్ వేదికగా క్వాలిఫయర్ 1 జరగనుంది. ఇందులో లీగ్ దశలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు తలపడతాయి. ఆపై మే 30న మూడో, నాల్గో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. జూన్ 1న అహ్మదాబాద్‌లో క్వాలిఫయర్ 2 జరగనుంది, ఇందులో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు ఎలిమినేటర్ విజేత తలపడతారు. జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌కి ఇది తుది అర్హత పోరుగా మారుతుంది.
ప్లేఆఫ్ ఫార్మాట్‌ను పరిశీలిస్తే, క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అయితే క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టుకు మరో అవకాశం లభిస్తుంది. అది క్వాలిఫయర్ 2లో ఎలిమినేటర్ విజేతతో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
ఫైనల్‌లో విజేతగా నిలిచే జట్టుకు భారీ ప్రైజ్‌మనీ లభించనుంది. గత సంవత్సరాల లెక్కల ప్రకారం, గెలిచే జట్టుకు రూ. 20 కోట్లకుపైగా, రన్నరప్‌కు దాదాపు రూ. 13 కోట్లు ప్రైజ్‌మనీగా లభిస్తుంది. ఈ విధానాన్ని ఐపీఎల్ 2022 నుండి కొనసాగిస్తున్నారు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా రూ. 20 కోట్లు గెలుచుకోగా, రన్నర్‌గా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13 కోట్లు పొందింది.
గత సంవత్సరాల ప్రైజ్‌మనీ ట్రెండ్‌ను పరిశీలిస్తే, 2008–2009లో విజేతకు రూ. 4.8 కోట్లు మాత్రమే ఇస్తుండగా, ఇది దశల వారీగా పెరిగి 2018–2019 నాటికి రూ. 20 కోట్లకు చేరుకుంది. 2020లో కరోనా ప్రభావంతో కొంత తగ్గినా, ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలో కొనసాగుతోంది. ఈసారి కూడా అదే ఫార్మాట్‌ను అనుసరించే అవకాశం ఉన్నప్పటికీ అధికారికంగా ఏ మార్పును ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించలేదు.