ప్రజాస్వామ్యం కోసం ఆరాటపడే ఒక గళం — ప్రపంచం వినేలా మారింది. వెనుజువెలా దేశానికి చెందిన 58 ఏళ్ల మ‌రియా కొరీనా మ‌చాడో ఇప్పుడు అంతర్జాతీయంగా ‘ప్రపంచ శాంతి దూత’గా నిలిచారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం 2025 సంవత్సరానికి మ‌రికొందరు బలమైన అభ్యర్థులను పక్కనబెట్టి, ఆమె పేరు గెలిచింది. మొత్తం 16 మంది పోటీలో ఉన్నా… తన ధైర్యం, త్యాగం, ప్రజాస్వామ్య నిబద్ధతతో మ‌రియా అందరినీ మించి నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఇంటికే బందీగా ఉంచినా, ఆమె గళాన్ని ఎవరూ ఆపలేకపోయారు. “నన్ను నిర్బంధించవచ్చు… కానీ నా ఆలోచనలను కాదు. నా సిద్ధాంతాలను కాదు” అంటూ మ‌రియా చరిత్ర సృష్టించారు. వెనుజువెలా వంటి నియంతృత్వ చరిత్ర కలిగిన దేశంలో - ప్రభుత్వానికి ఎదురు గళం విప్పడం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే.
 

అయినా ఆమె వెనకడుగు వేయలేదు. నిర్భయంగా, నిస్సంకోచంగా ప్రజల హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించారు. మరియాకు ఉన్న విద్యాబలం కూడా ఈ పోరాటంలో ఆయుధంలా మారింది. 1967 అక్టోబరు 7న జన్మించిన ఆమె ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఫైనాన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1992లో అనాథ పిల్లలు, వీధి బాలల కోసం ‘అటెనియా ఫౌండేషన్‌’ను స్థాపించి, తన జీవితం సేవకు అంకితం చేశారు. అనంతరం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఉద్యమం మొదలుపెట్టారు. ఇదే ఆమెకు శ్రమతో పాటు శాపంగా కూడా మారింది. ప్రభుత్వం ఆమెను దేశద్రోహం, కుట్ర కేసుల్లో ఇరికించి 21 సంవత్సరాల పాటు ఇంటికే బంధీగా ఉంచింది. 2002లో ఆమె ‘వెంటే వెనెజువెలా’ పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2010లో జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో గెలిచి శాసనసభలోకి ప్రవేశించారు.



కానీ ఇక్కడే ఆగిపోలేదు. ప్రభుత్వం కేసులు వేసి, ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అమెరికాతో సంబంధాలు పెట్టుకుందనే నెపంతో ఆమెను ఎన్నికలకు దూరం చేసింది. అయినా మ‌రియా భయపడలేదు. నిరసనలతో, ఉద్యమాలతో ప్రజల హక్కుల కోసం అహర్నిశలు కృషి చేశారు. 2024లో అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయాలనుకున్నా, అధికారాలు అడ్డుకున్నారు. అయినా ఆమె ఆగలేదు… అదే ఆమెను ప్రపంచం గుర్తించేట్టు చేసింది.ఇంత త్యాగం, ధైర్యం, నిస్వార్థ సేవకు ప్రతిఫలంగా నోబెల్ కమిటీ ఈ ఏడాది ప్రపంచ శాంతి దూతగా మ‌రియాను ఎంపిక చేసింది. ఒక మహిళ — ఒంటరిగా, నిర్బంధంలో ఉండి, వ్యవస్థకు ఎదురు నిలిచి చరిత్ర రాసింది. ఇది మ‌రియాకే కాదు… ప్రపంచంలోని ప్రతి ధైర్యవంతుడికి గర్వకారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: