కాంగ్రెస్‌లో లోక్‌సభ టికెట్ల కసరత్తు కొనసాగుతోంది. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో లోక్‌సభ టికెట్ల పార్టీ సమీకరణాలు మారాయి. చేవెళ్ల నుంచి రంజిత్‌ రెడ్డిని పోటీలో నిలపడం, అక్కడ నుంచి పోటీ చేయించాలని యోచించిన సునీతా మహేందర్‌ రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది.

ఇక సికింద్రాబాద్‌ లోకసభ స్థానం నుంచి మాజీ మేయర్‌ బొంతు రామ్మోన్‌ బదులు దానం నాగేందర్‌ను బరిలో దించాలని యోచిస్తోంది. ఒక సిట్టింగ్‌ ఎంపీ, ఒక సిట్టింగ్‌ ఎమ్మెల్యేని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధుల సర్దుబాటు జరిగినట్లు కనిపిస్తోంది. మరి ఈ రెండు టికెట్ల పంచాయితీ తేలినట్టేనా.. ఇంకా కసరత్తు కొనసాగుతుందా అన్నది తేలాలి. ఇప్పటి వరకు మాజీలకు మాత్రమే గేట్లు తెరచిన రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో సిట్టింగ్‌లకు కూడా ద్వారాలను బారుగా తెరిచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: