చేసిన అప్పులు తీర్చుకునేందుకు ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాళ్లను టార్గెట్‌గా చేసుకుని దోపిడీకి ప్రయత్నించిన ఓ వ్యక్తి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరం నడిబొడ్డున ఉన్న దోమలగూడలోని ఒక ఫ్లాట్‌లోకి పట్టపగలు ఓ అంగతకుడు చొరబడ్డాడు. అక్కడ ఒంటరిగా నివసిస్తున్న ఇద్దరు వృద్ధురాళ్లను కత్తులతో బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేశాడు. వారు ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వృద్ధురాళ్లను ఆస్పత్రికి తరలించారు. వారిపై దాడిచేసి పారిపోతున్న అగంతకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ప్రకాశం జిల్లా తాలూరు మండలానికి చెందిన కోట నరేందర్‌.. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇతను స్నేహితుల వద్ద అప్పులు చేసి జులాయి తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. అప్పులు తీర్చాలని స్నేహితులు ఒత్తిడి చేయడంతో డబ్బుల కోసం దోపిడీకి తెగబడ్డాడు. చిక్కడపల్లి దోమడగూడలోని సౌభాగ్య అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో హైకోర్టు రిటైర్డు ఉద్యోగి సీతా భాగ్యలక్ష్మి తోపాటు 66 ఏళ్లు వయసున్న జ్యోత్స్న రాణి అనే అక్కచెల్లెళ్లు ఒంటరిగా నివాసముంటున్నారు. ఇది ముందే తెలుసుకున్న నరేందర్‌.. ఈనెల 18న మధ్యాహ్నం సమయంలో అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి వారు ఇద్దరు ఉంటున్న ఫ్లాట్‌లోకి చొరబడ్డాడు. తొలుత ఒకరిపై మెడపై కత్తి పెట్టి డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఆమె అరుపులు విని లోపల గదిలో ఉన్న మరో మహిళ.. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అందుబాటులో ఉన్న కత్తి తీసుకుని అతడిని బెదిరించింది. దీంతో దుండగుడు భయంతో ఇద్దరు మహిళలపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.

దుండగుడి దాడిలో గాయపడిన ఇద్దరు మహిళల అరుపులు విని బయటకు వచ్చిన అపార్ట్‌మెంట్‌ వాసులు.. పారిపోతున్న అగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన ఇద్దరు అక్కచెల్లెళ్లను హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సకు చేర్చారు. వారికి సుమారు ౩౦ కుట్లు పడినట్లు బాధితురాళ్ల మేనల్లుడు తెలిపాడు. నిందితుడు నరేందర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడ్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: