
భారత రాజధాని ఢిల్లీలో పెద్దల పరువుకు ఒక భర్త చనిపోగా.. భార్య ఆస్పత్రి పాలైంది. ప్రస్తుతం ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి ఇది పరువు హత్యే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుంటే.. గురువారం రోజు ద్వారకలోని అంబర్‌హై గ్రామంలో నివసిస్తున్న 23 ఏళ్ళ వినయ్ దహియా అనే యువకుడిని కొందరు వ్యక్తులు అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. అతని శరీరం లోకి నాలుగు బుల్లెట్లు చొచ్చుకు పోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ తుది శ్వాస విడిచాడు.
అయితే ఇదే దాడిలో వినయ్ భార్య కిరణ్ దహియా పై కూడా కాల్పులకు తెగబడ్డారు. ఆమెను ఏకంగా ఐదు సార్లు గన్ తో కాల్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అయితే స్థానిక ప్రజలు గురువారం రోజు రాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కిరణ్ దహియా బుల్లెట్ గాయాలతో మృత్యువుతో పోరాడుతోంది. దీంతో పోలీసులు ఆమెను హుటాహుటిన వెంకటేశ్వర్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.
అయితే ఈ ఘటన గురించి ద్వారక డిప్యూటీ కమిషనర్ సంతోష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. "వినయ్ దహియా హర్యానాలోని సోనిపట్ కి చెందిన వ్యక్తి అని తెలిసింది. అతడు తన భార్య కిరణ్ దహియా (19) తో కలిసి అంబర్‌హై గ్రామంలోని అద్దెకు తీసుకున్న ఓ వసతి గృహంలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సుమారు ఏడుగురు వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు" అని తెలిపారు.