ఈసారి టీడీపీ నిర్వహించే మహానాడు చరిత్రలో నిలిచిపోనుంది. ఎందుకుంటే దీనిని ఈ సారి నిర్వహించేంది వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలాకా అయిన కడపలో. ఈ మేరకు సీఎం చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కడపలో జాతీయ స్థాయి మహానాడు జరగలేదు.
ఆది నుంచి కడప అంటే వైఎస్సార్ ఫ్యామిలీనే గుర్తుకు వస్తోంది. ఈ జిల్లా వైఎస్ కుటుంబానికి బలీయమైన కంచుకోట. ఇక్కడ వైఎస్ కుటుంబీకుల మాటలే శిలాశాసనం. వారు చెప్పిన.. మద్దతు ఇచ్చిన నేతలే ఇక్కడ గెలుస్తుంటారు. కానీ అనూహ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో తొలిసారిగా వైఎస్ కుటుంబానికి బీటలు బారినట్లు అయింది.
గత ఎన్నికల్లోనే వైనాట్ పులివెందుల అంటూ నినాదం ఇచ్చిన చంద్రబాబు ఈసారి దానిని అమలు చేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా జగన్ కు చెక్ పెట్టేందుకు మహానాడుకు కడప జిల్లాను ఎంపిక చేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కడపలో తమ బలం చూపించాలని వ్యూహాలు రచిస్తున్నారు.
వైసీపీ అధినేత సొంత జిల్లా ఆ పార్టీకి ఖిల్లాగా ఉన్న కడప గడపలోనే భారీ రాజకీయ భేరీని మోగించాలని చూస్తోంది. వైసీపీ ఓటమి పాలు అయినా కడపలో జగన్ కి విశేషమైన జనాదరణ లభిస్తోంది. దానిని పూర్వ పక్షం చేస్తూ కడపలో సైతం పసుపు జెండాలు రెపరెపలాడేలా చేయాలన్నదే టీడీపీ వ్యూహకర్తల లక్ష్యంగా ఉంది. అందుకే కడపలో మహానాడుని ఏర్పాటు చేయబోతున్నారు. మే 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. ఈ సభతోనే వైసీపీకి చెక్ పెట్టేలా చూడాలన్నది టీడీపీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. మొత్తం కడపలో కనీవినీ ఎరుగని తీరులో భారీ బహిరంగ సభను నిర్వహించడం అంతటా పసుపు దనాన్ని వెల్లి విరిసేలా చూడడం చేయాలని భావిస్తోంది. మొత్తానికి టీడీపీ పద్మ వ్యూహంలో భాగమే కడప మహానాడు అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి