బిచ్చగాడు, బిచ్చగాడు2 సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ ఆంటోని మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని విజయ్ ఆంటోని మార్గన్ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఒకింత ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మార్గన్ : ది డెవిల్ తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలైంది.

కథ :

హైదరాబాద్ కు చెందిన రమ్య అనే యువతి  ఊహించని విధంగా దారుణంగా హత్యకు గురవుతుంది.  ఆమె శరీరం కాలిపోయిన  విధంగా ఉండటంతో పాటు నలుపు రంగులోకి  మారుతుంది.  చెత్తకుప్పలో రమ్య మృతదేహం దొరకగా ఆమె హత్య ఒకింత సంచలనం అవుతుంది.  ఈ కేసుకు సంబంధించిన బాధ్యతలు ముంబైకు చెందిన  అడిషనల్ డీజీపీగా పని చేస్తున్న  ధ్రువ కుమార్ (విజయ్ ఆంటోని) అనధికారికంగా  స్వీకరిస్తారు.

తన కూతురు సైతం గతంలో అదే   విధంగా హత్యకు గురైన నేపథ్యంలో కేసును  ఎలాగైనా చేధించాలని ధ్రువ కుమార్ భావిస్తారు.  ధ్రువ కుమార్  విచారణలో అరవింద్ ( అజయ్ దిశాన్) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారించగా కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.  ఈ కేసు విచారణ సందర్భంగా ధ్రువ కుమార్ కు తెలిసిన నిజాలేంటి? అసలు హంతకులు  దొరికారా? క్లైమాక్స్ లో ఊహించని  ట్విస్ట్ ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

మార్గన్  సినిమా విడుదలకు ముందే ఈ సినిమాకు సంబంధించిన 6 నిమిషాల ఫుటేజీని  యూట్యూబ్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు దాదాపుగా ఒకే విధంగా సాగుతాయి. అయితే అరవింద్ ను ధ్రువ కుమార్ పట్టుకోవడంతో  కథ కొలిక్కి వచ్చిందని  చాలామంది భావిస్తారు. అయితే అక్కడినుంచి  ఈ  సినిమాలో చోటు చేసుకునే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.   అరవింద్ పాత్రకు ఉన్న సూపర్ పవర్ ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తుంది.  ఇంటర్వెల్ ట్విస్ట్ సైతం ఈ సినిమాకు హైలెట్  అయింది.

అయితే ఈ సినిమాకు సంబంధించి  దర్శకుడు  లియో జాన్ పాల్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు.  క్లైమాక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే  బాగుండేది. ధ్రువ కుమార్ పాత్రలో విజయ్ ఆంటోని అదరగొట్టారు.  పోలీస్ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అజయ్ దిశాన్  సూపర్ హీరోగా, కొన్ని సన్నివేశాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకోవడం గమనార్హం.  సముద్రఖని గెస్ట్ రోల్ లో ఆకట్టుకున్నారు.  సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, నిర్మాణ విలువలు  కథకు అనుగుణంగా ఉన్నాయి.  విజయ్ ఆంటోని ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు.

బలాలు :  అరవింద్ రోల్, ఫస్టాఫ్,  కథనం

బలహీనతలు : సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు,  హత్యలకు బలమైన  కారణం లేకపోవడం

రేటింగ్ : 3.0/5.0


మరింత సమాచారం తెలుసుకోండి: