మీడియా అంటే సమాజంలో అదో ప్రత్యేక హోదా.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా పేరు. ఈ సమాజంలో జరిగే ఏ అవినీతినైనా, అక్రమాన్నైనా, అసంబద్దతనైనా కడిగిపారేయొచ్చు.. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. వాస్తవానికి రాజ్యాంగంలో పత్రికాస్వేచ్ఛ అంటూ ప్రత్యేకంగా హక్కేమీ లేదు. కానీ భావప్రకటనాస్వేచ్ఛ అంటూ ఓ హక్కు ఉంది కదా. అందులోనే పత్రికా స్వేచ్ఛ కూడా ఉందని సుప్రీం కోర్టే అనేక కేసుల్లో చెప్పేసింది.


అందుకే చాలా మంది నాయకులు మీడియాకు  భయపడుతుంటారు. అయితే ఈ పత్రిక స్వేచ్ఛను కొందరు తమకు నచ్చిన రాజకీయ పార్టీల నాయకుల ప్రయోజనాల కోసం వాడుతుంటారు. అలాగే తమకు నచ్చని రాజకీయ నాయకులను భ్రష్టు పట్టించేందుకు వాడుకుంటారు. అయితే తప్పుడు వార్తలను రాసే పత్రికలను శిక్షించేందుకు చట్టంలో అనేక మార్గాలు ఉన్నా సాధారణంగా  నాయకులు అంత సాహసం చేయరు. మీడియా వాళ్లతో కెలుక్కోవడం ఎందుకులే అనుకుంటారు.


అంతగా తమపై తప్పుడు వార్త వస్తే.. ఆ వార్తా సంస్థకు సమాధానం చెబుతారు. తమ వర్షన్ కూడా రాయమని డిమాండ్ చేస్తారు. ఇక తాజా విషయానికి వస్తే.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ధోరణి మొదటి నుంచి చంద్రబాబు అనుకూలమని.. వైఎస్ , వైఎస్ జగన్ వ్యతిరేకమని ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ఆయన పత్రికలో వచ్చే వార్తలు, ఆయన స్వయంగా రాసే కొత్త పలుకు వంటి వ్యాసాల్లో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. అయినా సరే.. ఈ ఆర్కే అంతేలే అని చాలా మంది వదిలేస్తారు. వైసీపీ వాళ్లయితే డైరెక్టుగా ప్రెస్ మీట్లు పెట్టి ఏకేస్తారు. అది వైసీపీకీ, ఆర్కే కూ అలవాటైపోయింది.


కానీ.. కొత్తగా ఇప్పుడు ఆర్కేని పబ్లిగ్గా  ఏకేసే జాబితాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా చేరిపోయారు. తాజాగా ఆర్కే రాసిన విశ్లేషణలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు  వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని  ఆర్కే తన సహజధోరణిలో రాశారు. కానీ దీనికి సోము వీర్రాజు చాలా ఘాటుగా స్పందించారు. ఆ వార్తపై స్పందనను బహిరంగ లేఖ ద్వారా రాస్తూ ఆర్కే తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.  


"గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసిందంటూ వాతలు పెట్టేశారు. ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబునాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుందన్నారు.  

అంతే కాదు... మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా? అదే నిజమైతే, మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం.. అంటూ ఏకేశారు సోము వీర్రాజు. బాబోయ్.. ఆర్కేకు ఇప్పటి వరకూ  ఇంత ఘాటుగా స్పందించిన వైసీపీయేతర తొలి నాయకులు సోము వీర్రాజే కావచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: