హిందూపురం అంటే నందమూరి ఫ్యామిలీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. టీడీపీ ఆవిర్భావించిన దగ్గర నుంచి ఇక్కడ పసుపు జెండా ఎగురుతూనే ఉంది. అలాగే ఈ నియోజకవర్గం నందమూరి ఫ్యామిలీకి కలిసొచ్చింది. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా,  ఒకసారి హరికృష్ణ విజయం సాధించారు. అలాగే గత రెండు పర్యాయాలు హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గెలుస్తున్నారు.


మొదట నుంచి టీడీపీలో యాక్టివ్‌గా ఉంటూ, అవసరమైనప్పుడల్లా ఎన్నికల ప్రచారం చేసిన బాలయ్య తొలిసారి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. హిందూపురం ఎలాగో టీడీపీకి కంచుకోట కాబట్టి, బాలయ్య విజయానికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. ఇక ఐదేళ్లు బాలయ్య హిందూపురం నియోజకవర్గానికి సేవ చేశారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పనులు చూసుకుంటూ, ఎమ్మెల్యేగా హిందూపురం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.


తాను అందుబాటులో లేకపోయినా సరే టీడీపీ నాయకుల ద్వారా పనులు చక్కబెట్టారు. అయితే బాలయ్య ఆ ఐదేళ్లలో హిందూపురం ప్రజలకు చేసింది ఏమి లేదని, పైగా అభిమానులపైనే చేయి చేసుకునేవారని, ఇక హిందూపురంలో బాలయ్య గెలవరని ప్రత్యర్ధులు సైతం గట్టిగానే ప్రచారం చేశారు. కానీ ఎవరు ఊహించని విధంగా 2019 ఎన్నికల్లో జగన్ గాలి ఉన్నా సరే హిందూపురంలో బాలయ్య విజయం సాధించారు.


2014 ఎన్నికల్లో కంటే ఈసారి మంచి మెజారిటీ తెచ్చుకున్నారు. ఇలా రెండోసారి ఎమ్మెల్యే అయిన బాలయ్య, హిందూపురం ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికారులతో మాట్లాడి పనులు చేయించుకుంటున్నారు. అలాగే సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి కరోనా వేళ హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తున్నారు.


అందుబాటులో లేకపోయినా సరే తమ నాయకుల ద్వారా హిందూపురం ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇక ఇదే ఊపు ఉంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా బాలయ్యకు వైసీపీ చెక్ పెట్టడం కష్టమని టీడీపీ అభిమానులు అంటున్నారు. ఏదేమైనా హిందూపురం వైసీపీ నాయకులకు బాలయ్యతో ఇబ్బందే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: