మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ రామకృష్ణ అలియాస్‌ సాకేత్‌ అలియాస్ హరగోపాల్‌.. ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నో సార్లు పోలీసుల దాడుల నుంచి గాలింపు నుంచి త్రుటిలో తప్పించుకున్న అగ్రనేత ఆర్కే.. ఇప్పుడు కూడా పోలీసులకు చిక్కి ప్రాణాలు కోల్పోలేదు.. అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ ధ్రువీకరించింది. అయితే.. ఆర్కే  పార్టీ సభ్యులకు రాసిన చివరి లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిసెంబరు 2 నుంచి పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ అంటే పీఎల్జీఏ ద్విశతాబ్ది వార్షికోత్సవాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ఆయన ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. సాకేత్‌ పేరుతో ఆర్కే రాసిన చివరి లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.


మావోయిస్టు పార్టీ క్రమంగా తన ప్రాభవం కోల్పోతోంది. మారుతున్న కాలంతో పాటు మావోయిస్టు ఉద్యమంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆర్కే భావించారు. పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు అధిగమించాల్సిన అడ్డంకులెన్నో ఉన్నాయని ఆర్కే తన చివరి లేఖలో తెలిపారు. ఆర్కే చివరి లేఖలో ఇంకా ఏం రాశారంటే.. ఉద్యమం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారానే విజయాలు సాధించడం సాధ్యమంటున్నారు ఆర్కే.


ఆర్కే తన చివరిలేఖలో.. ఉద్యమ ఆశయం, ప్రస్తుత గడ్డు పరిస్థితులు, చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సహచరులకు వివరించారు. బుద్ధుడు, మహాత్మాగాంధీ పుట్టిన ఈ దేశంలో ప్రజలపై వారి ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి హింసాత్మక మార్గం చేపట్టరని గతంలో కొన్ని అపోహలు ఉండేవని.. కానీ.. 1970 అక్టోబరు 27వ తేదీన బిహార్‌లోని మాగుర్జాన్‌ రైతాంగ దళం పోలీసులపై దాడితో అవి పటాపంచలు అయ్యాయని ఆర్కే గుర్తు చేసుకున్నారు. పీఎల్జీఏకు ఇదే పునాది అన్న ఆర్కే.. గత 20 ఏళ్లుగా అణచివేతలను దృఢంగా ఎదుర్కొంటూ ఉద్యమం  రోజురోజుకూ పురోగమిస్తోందన్నారు.


ప్రజల పక్షపాతిగా పీఎల్‌జీఏ ఇప్పటికే నిరూపించుకుందని.. అయితే.. ఇప్పటికీ అధిగమించాల్సిన అడ్డంకులు ఎన్నో ఉన్నాయని ఆర్కే తనలేఖలో తెలిపారు. పొరపాట్లను తగ్గించుకుంటూ ఎక్కువ విజయాలు సాధించాలని సహచరులకు పిలుపు ఇచ్చిన ఆర్కే.. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు రూపొందించుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RK