తెలంగాణ‌లోని హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక‌ల ఫ‌లితాలు కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన‌ది. డిపాజిట్ కూడ ద‌క్క‌కుండా ఓట‌మి పాల‌వ్వ‌డంతో కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల వార్ కొన‌సాగుతున్న‌ది. ఈ ఉప ఎన్నిక ఓట‌మిపై అంత‌ర్మ‌థ‌నానికి బ‌దులుగా అంతర్ యుద్ధ‌మే న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. చివ‌రికీ ఓట‌మికి గ‌ల‌ కార‌ణాల‌ను తెలుసుకునేందుకు ఓ క‌మిటీని వేయాల‌ని సిద్ధ‌మ‌య్యారు. కొంత మంది సీనియ‌ర్ సీనియ‌ర్ నాయ‌కులు పీసీసీ రేవంత్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. మ‌రోవైపు పార్టీకి సంబంధించిన అంత‌ర్గ‌త వ్యవ‌హారాల‌పై మీడియా ముందు కామెంట్స్ చేయ‌వ‌ద్ద‌ని సూచించారు ఇన్‌చార్జీ మాణిక్యం ఠాగూర్‌.

అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ఇన్‌చార్జీ మాణిక్యం ఠాగూర్‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారారు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌ట‌రెడ్డి వెంక‌ట్‌రెడ్డి.  నిత్యం ఏదో ఓ సంద‌ర్భంలో కాంగ్రెస్ పార్టీ ప‌రువును రోడ్డ‌న ప‌డేస్తున్నారు కోమ‌ట్‌రెడ్డి. ఇటీవ‌ల వెలువ‌డిన  హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితంపై రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌ల‌ను ప‌దేప‌దే కొన‌సాగిస్తోన్నారు. కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్క‌డు కాద‌ని, వందేండ్ల చరిత్ర ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ పీసీసీ చీఫ్‌గా నియ‌మితులు అయ్యాక త‌న‌ను ఏ స‌మావేశానికి పిలువ‌లేద‌ని మండిప‌డ్డారు కోమ‌టిరెడ్డి. పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీలో త‌న‌ను 13వ నెంబ‌ర్‌గా పెట్ట‌డంపై  ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నేత ప్రేమ్‌సాగ‌ర్ వ్యాఖ్య‌ల‌లో ఎలాంటి త‌ప్పులేద‌ని చెప్పారు కోమ‌టిరెడ్డి.

సొంత ఎజెండా పెట్టుకొని, సొంత పాట‌లు పెట్టుకొని ఈవెంట్ల‌ను చేస్తే పార్టీ బ‌లోపేతం కాద‌ని స్ప‌ష్టం చేశారు. కేవ‌లం ఒక ప్రేమ్‌సాగ‌ర్ మాత్ర‌మే కాదు, శ్రీ‌ధ‌ర్‌బాబు, జీవ‌న్‌రెడ్డి లాంటి నేత‌ల‌తో స‌హా లెక్క‌చేయ‌కుండా నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌తీసారి ఎవ‌రినో ఒక‌రిని అవ‌మానం పాలు చేస్తున్నారు. దీంతో  కాంగ్రెస్ పార్టీకి న‌ష్టం త‌ప్ప మ‌రేమి లేదు. న‌ష్టం జ‌రిగితే మాత్రం ఊరుకునే ప్ర‌సక్తే లేద‌ని ఎద్దేవా చేశారు ఎంపీ కోమ‌టిరెడ్డి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోఓ నా అవ‌స‌రం లేద‌నే క్రికెట్ చూడ‌డానికి వెళ్లాను. 33 ఏండ్ల కాంగ్రెస్ చరిత్ర‌లో హుజూరాబాద్ ఎన్నిక నాకు షాక్‌కు గురి చేసిన‌దని పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌ను రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌క‌త్వం అంత‌గా సీరియ‌స్‌గా తీసుకోలేద‌ని ఆరోపించారు. కాంగ్రెస్‌లో టీడీపీ ర‌క్తం నింపుతున్నార‌ని, వ‌ల‌స వ‌చ్చిన టీడీపీ నేత‌ల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నార‌ని ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు చేశారు.  ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న కాంగ్రెస్ ప‌రిణామాల‌పై రాహుల్‌గాంధీ, సోనియాగాంధీల‌కు వివ‌రిస్తాను అని పేర్కొన్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: