
కేంద్రం తీసుకున్న నూతన నిర్ణయం అమలులోకి వస్తే ఫాస్టాగ్ విధానం కూడా త్వరలో కనుమరుగు అవుతుంది. దాని స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ అమలులోకి రాబోతోంది. దీనికోసం కేంద్రం కసరత్తులు చేస్తోంది. దీని ద్వారా వాహనదారులకు మేలు చేకూరుతుందనే ఉద్దేశంతో కేంద్రం దీన్ని తెరపైకి తెస్తోంది.
ఐరోపా దేశాల్లో ఇదే పద్ధతి..
ప్రస్తుతం ఐరోపా దేశాల్లో ఫాస్టాగ్ లు లేవు. శాటిలైట్ ఆధారిత గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం అక్కడ అందుబాటులో ఉంది. ఈ వ్యవస్థ ద్వారా అక్కడ వాహనాలకు టోల్ పన్ను చెల్లిస్తుంటారు. ప్రస్తుతం హైవే ఎక్కగానే ఎక్కడ టోల్ గేట్ దాటినా అక్కడ పన్ను చెల్లించాల్సిందే. అందే టోల్ గేట్ ముందు ప్రయాణం ప్రారంభించి, టోల్ గేట్ దాటిన తర్వాత ఆ ప్రయాణం ముగించినా కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. అంటే ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించినా టోల్ బాదుడు తప్పించుకోలేమనమాట. శాటిలైట్ ఆధారిత నేవిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే టోల్ పన్ను విషయంలో వెసులుబాటు ఉంటుంది. టోల్ రోడ్ పై ఎన్ని కిలోమీటర్లు వాహనం ప్రయాణం చేస్తే అన్ని కిలోమీటర్ల దూరానికే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడదు. తక్కువ దూరాలకు కూడా టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం దీనిపై అధ్యయనం జరుగుతోంది. త్వరలో ఈ పద్ధతి భారత్ లో అమలులోకి రాబోతోంది.