మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే పుట్టిముణగటం ఖాయమేనా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శివసేనపార్టీలో  తిరుగుబాటు చేసి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం కూలిపోవటానికి షిండే కారణమని అందరికీ తెలిసిందే. బీజేపీతో చేతులుకలిపి శివసేన చీఫ్, అప్పటి సీఎం అయిన ఉత్థవ్ థాక్రేపై తిరుగుబాటు చేయటంతో షిండే పేరు దేశంలో మారుమోగిపోయింది.

శివసేనలోని 55 మంది ఎంఎల్ఏల్లో 40 మందిని చీల్చి తనతో వేరుకుంపటి పెట్టుకునేట్లు చేశారు. దాంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. అప్పటివరకు తెరవెనుక పాత్రకే పరిమితమైన బీజేపీ ఒక్కసారిగా యాక్టివై షిండేతో చేతులుకలిపింది. దాంతో షిండేవర్గం+బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే తాజా సమాచారం ఏమిటంటే షిండేవర్గంలోని 40 మంది ఎంఎల్ఏల్లో 20 మంది బీజేపీ వైపు చూస్తున్నారట.

శివసేనను చీల్చేసమయంలో తనతో వచ్చేవాళ్ళందరికీ షిండే మంత్రిపదవులను ఎరేశారు. తీరా ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరటంతో మంత్రివర్గంలో షిండేవర్గంలో చాలామందికి మంత్రిపదవులు దక్కలేదు. దాంతో చాలామంది ఎంఎల్ఏల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. వీళ్ళల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని పట్టించుకోకపోతే వీళ్ళు మళ్ళీ థాకరే వైపు వెళ్ళే ప్రమాదముందని బీజేపీ గ్రహించి వాళ్ళని దువ్వటం మొదలుపెట్టిందట. షిండే మీద అసంతృప్తితో ఉన్న వాళ్ళని తమపార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందని థాకరే ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రిక సామ్నాలో ప్రముఖంగా వచ్చింది.

దాంతో తొందరలోనే మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ వేడిరాజుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది. అసంతృప్తితో ఉన్న ఎంఎల్ఏలు మళ్ళీ థాకరే వెళితే ఇపుడు ప్రభుత్వం పడిపోవటం ఖాయం. అందుకనే అసంతృప్త ఎంఎల్ఏలను అటువూపైపు వెళ్ళకుండా కమలనాదులు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.  బీజేపీ ప్రయత్నాలు సక్సెస్ అయితే ప్రభుత్వం నిలుస్తుంది లేకపోతే మళ్ళీ సంక్షోభం తప్పేట్లులేదు. మరి షిండేవర్గంలోని ఎంఎల్ఏలు బీజేపీలో చేరిపోతే అప్పుడు షిండేవర్గం మైనారిటిలో పడిపోతుంది కదా. అందుకనే మొత్తం ఎంఎల్ఏలను బీజేపీ అగ్రనేతలు తమపార్టీలో  కలిపేసుకున్నా ఆశ్చర్యంలేదు. అప్పుడు షిండే పుట్టిముణగటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: